News

ఉగ్ర బాట వీడి అమ్మ ఒడికి

122views

దారి మళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్‌ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘ఆపరేషన్‌ మా’ పేరుతో ఇండియన్‌ ఆర్మీ ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా ఇప్పటివరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం పడగ నీడను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ కుటుంబాలను చేరుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారు.
ఏమిటీ ‘ఆపరేషన్‌ మా’?
”ఈ పథకం ముఖ్య లక్ష్యం పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన కశ్మీరు యువతను వెనక్కి తీసుకువచ్చి సమాజంతో మమేకం అయ్యేలా చేయడమే. ఇది కేవలం స్థానిక యువత కోసమే రూపొందించిన కార్యక్రమం. ఉగ్రవాద మార్గం నుంచి మళ్లించడమే కాకుండా వారికి పునరావాసం కల్పించే బాధ్యతను కూడా భారత సైన్యం తీసుకుంటుంది. పెడదారి పట్టిన యువత మనసు మార్చడం వారి మాతృమూర్తుల వల్లే సాధ్యం. మేము వారి తల్లుల ద్వారా వారు ఉగ్రవాదం వీడేలా ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకే ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్‌ మా’ అని పేరుపెట్టాం.” అని దీనికి నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ కె.జె.ఎస్‌. థిల్లాన్‌ తెలిపారు.

గతంలోకూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన యువతను సరైన మార్గంలో పెట్టడానికి సైన్యం అనేక చర్యలు చేపట్టింది. అయితే ఈ ఏడాది ప్రారంభించిన ‘ఆపరేషన్‌ మా’ ప్రత్యేకం. ఉగ్రవాద గ్రూపులను వదిలి వచ్చిన వారిపై ఏ విధమైన ప్రభుత్వ చర్యలు ఉండబోవని హామీ ఇస్తున్నారు. అటువంటి వారి వివరాలను బయటకు కూడా చెప్పరు. వారి దగ్గరి బంధువులకు కూడా తెలియనంత గోప్యంగా ఉంచుతారు. అంతేకాకుండా వారి పునరావాసానికి సంబంధించిన వివరాలు కూడా ఎవరికీ తెలియనీయకుండా ఉంచుతారు. ఉగ్రవాద ముఠాల్లో చేరకపోయినా వారి పట్ల సానుభూతి కలిగి, రాళ్లు విసరడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే యువతకూ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద యువతను ఆహ్వానిస్తూ సైన్యం నిరంతరం రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోంది.

Source : Enadu.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.