
దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ తెలిపారు. అనకాపల్లిలోని కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల దేవాదాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మావేశంలో జిల్లా కలెక్టరు దేవాలయాలలో వినియోగిస్తున్న ఆహార వస్తువులు వివరాలు, వాటి సేకరణ విధానాలు, ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానం పండిస్తున్న పంటలు, వాటి లభ్యత వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా విజయ కిృష్ణన్ మాట్లాడుతూ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో గల దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, వారు పండించే సరుకులకు మార్కెటింగు సదుపాయం కల్పించాలన్నారు. ఈ విధానం అమలు తొలిదశలో దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాలకు కావలసిన సరుకులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయ్యాలని, అందుకుగాను అవసరమైన ప్రతిపాదనలు సిద్దంచేయాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశించారు. ఏ దేవాలయానికి ఏ వ్యవసాయ రైతు సంఘం ద్వారా సరుకులు సరఫరా చేయాలనే విషయం మ్యాపింగు చెయ్యాలని, అదేవిధంగా సరుకులు సరఫరా చేయ్యాలని తెలిపారు. నూరుశాతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మాత్రమే సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులకు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని, భవిష్యత్తులో దేవాలయాలకు కావలసిన సరుకులన్నింటిని సరఫరా చేయుటకు వ్యవసాయ అదికారులు ప్రణాళిక సిద్దంచేసుకోవాలని, సాగును పెంచాలని జిల్లా కలెక్టరు తెలిపారు.





