News

నక్సలైట్లతో చర్చలకు సిద్ధమే.. కానీ బేషరతుగా వుండాలి : ప్రభుత్వం కీలక ప్రకటన

307views

శాంతి చర్చలకు తాము సిద్ధమని నగ్జలైట్లు ప్రకటన చేసిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం స్పందించింది. మావోయిస్టులతో చర్చలకు తామూ సిద్ధంగానే వున్నామని ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం శర్మ ప్రకటించారు. అయితే.. చర్చలకు ఎలాంటి షరతులు లేకుండా వుండాలని మాత్రం తేల్చి చెప్పారు. వారు చర్చల కోసం ఒకర్ని నియమించాలని లేదా పంపాలన్నారు. అంతమాత్రాన ప్రభుత్వ బలగాలు ఆగిపోతాయన్న ఉద్దేశం మాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించే ప్రతి ఒక్కరితో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.

మావోయిస్టులు తమ లేఖలో కాల్పుల విరమణను ప్రస్తావించారని ఉటంకించారు. అసలు యుద్ధం లాంటి వాతావరణమే లేనప్పుడు అలాంటి పరిభాషను ఎందుకు ఉపయోగిస్తారని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఇలాంటి పరిభాషతో చర్చలకు సానుకూల వాతావరణం ఎలా ఏర్పడుతుందని నిలదీశారు. ఒక్క బుల్లెట్ కూడా పేల్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం లేదని, అందుకే లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అసలు యుద్ధ వాతావరణమే లేనప్పుడు కాల్పుల విరమణ అన్నది ఎలా వస్తుందన్నారు. బస్తర్ లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని, ఎవరు అడ్డు వచ్చినా చేస్తామని డిప్యూటీ సీఎం శర్మ తేల్చి చెప్పారు.