ArticlesNews

ముక్తి సాధనం బాలయోగీశ్వర ఆరాధనం

382views

( మార్చి 28 – ముమ్మిడివరం బాలయోగీ వర్ధంతి )

యోగం అంటే మనుషులకు మాత్రమే కాదు అన్ని ప్రాణులకు అలాగే ప్రకృతికి కూడా హాని చేయకుండా ఈ సృష్టి పురుషునితో తాదాత్మ్యత చెందుతూ జీవించడం. అలా జీవించిన మహనీయులలో ఒకరు ముమ్మిడివరం బాలయోగీశ్వరులు. కోనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో కటికదల గంగయ్య, రామమ్మ అనే పేద దళిత దంపతులకు 23 అక్టోబరు 1930న మూడవ సంతానంగా బాలయోగీశ్వరులు జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సుబ్బారావు. ఎలాంటి విద్యాభ్యాసం లేదు. సుబ్బారావుకి 10 ఏళ్ల వయసు రాగానే అతని తండ్రి.. బాపన్న అనే రైతు వద్ద గోవుల కాపరిగా చేర్పించారు. సుబ్బారావు ఎర్రగా బొద్దుగా చూడముచ్చటగా ఉండడం వల్ల బాపన్న భార్య సీతమ్మ పండు అని పిలిచేది. ఈ పేరే అందరికి సుపరిచితం అయింది. బాపన్న వద్ద 3 సంవత్సరాలు గోవుల కాపరిగా ఉన్న సుబ్బారావు ఆ తర్వాత పెద సత్తయ్య వారి ఇంట 2 సంవత్సరాలు చిన్న పాలేరుగా గోవులను కాచాడు. అలాగే వెంకన్న అనే భూస్వామి వద్ద కూడా కొంతకాలం పాలేరుగా చేశాడు. అలా సుబ్బారావుకు బాల్యంలో గోవులే ఆప్తమిత్రులు, జ్ఞానోదయ ప్రభాకరులు.

పూర్వజన్మ వాసనల ఫలితమో ఏమోగానీ, సుబ్బారావు ధ్యాస తపస్సు వైపు మళ్లింది. అలా తన 16వ ఏట ఆయన శ్రీకృష్ణుడు, నారద మహర్షి ఉన్న చిత్రపటాన్ని తీసుకొని దగ్గరలోని కొబ్బరితోటలో యోగముద్రలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుని మోక్షదాతగా, నారద మహర్షిని గురువుగా సంభావించి సుబ్బారావు పూజించాడు. అలా పిన్నవయసులోనే తపస్సు ప్రారంభించిన సుబ్బారావును చూసేందుకు తన సొంత గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. అలా వచ్చినవారు ఆయన్ను బాలయోగి అని పిలవడం ప్రారంభించారు. ఆయన 55 సంవత్సరాలు జీవించి సుమారు 39 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేసినా, పేరు మాత్రం బాలయోగిగానే స్థిరపడిపోయింది. ముక్తిని పొందడానికి, జ్ఞానం పొందడానికి సాధన అవసరమని భావించిన బాలయోగీశ్వరులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు మౌనముద్రలోనే దాదాపు గడిపారు. ధ్యాన సమాధి స్థితిలో మౌనాన్నే సంకేతంగా చేస్తూ భక్తుల్లో జ్ఞాన తృష్ణను మేల్కొల్పారు.

లోకానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటని ఓ భక్తుడు అడుగగా, అంతా శ్రీకృష్ణపరమాత్మ గీతలోనే చెప్పాడు. ఇక నేను వేరుగా చెప్పవలసిందేమి లేదు అని బాలయోగీశ్వరులు సెలవిచ్చారు. నిజమే, భారతీయ తాత్వ్తిక దృక్పథమంతా, వేదవేదాంతసారమంతా ‘భగవద్గీత’లోనే ఉంది కదా. నిష్కామ కర్మయోగం ద్వారా లోక జీవితం కొనసాగిస్తూనే, జీవన్ముక్తి కొరకు భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాల ద్వారా ప్రతివారు తమ ఆధ్యాత్మిక చింతన చేస్తూ, సాధన చేస్తూ తరించాలని గదా భగవద్గీత చెబుతోంది. మరి అంతకంటే వేరే సందేశమేముంటుంది. తానెవ్వరో తెలుసుకుని, చంచలమైన మనస్సును కట్టిపెట్టగలిగితే తన ఆత్మే తన గురువగును అని ఆయన బోధించారు. అలాగే, తపస్సు చేసుకునేందుకు హిమాలయాలకో, అడవులకో వెళ్ళాల్సిన అవసరం లేదని, ప్రజాసమూహం మధ్యలో కూడా తపస్సు చేయవచ్చనే సందేశాన్ని ఇచ్చారు. భగవత్ తత్త్వాన్ని అన్వేషిస్తూ యోగవిద్యను వశపర్చుకొని అష్టాంగ యోగం ద్వారా అనితర తపస్సుతో ధ్యాన సమాధిలోకి వెళ్లిన బాలయోగీశ్వరులు 28 మార్చి 1985లో శివైక్యం చెందారు. సామాజిక, కుల ఆంతరాలకు అతీతంగా సిద్ధ యోగమును సాధించి, ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది, సర్వ మానవులు దేవుని దృష్టి యందు ఒకటే అనే భావనను నిజం చేసి నిరూపించారు. ఆధునిక భారతీయ యోగుల పరంపరలో ఆరాధ్యుడిగా నిలిచిపోయారు.