ArticlesNews

మాతృ ‘శ్రీమంతురాలు’ జిల్లెళ్ళమూడి అమ్మ

308views

( మార్చి 28 – జిల్లెళ్ళమూడి అమ్మ జయంతి )

తెలుగునాట జిల్లెళ్ళమూడి పేరు తెలియని వారుండరు. ఆ అమ్మ గుర్తుకొచ్చి రెండు చేతులూ జోడించని వ్యక్తి కనిపించరు. ఎందుకంటే, ఎవరి కళ్లు చెమ్మగిల్లినా ఊరడించింది ఆ మాతృశ్రీనే. ప్రేమ భావనతో నూతన సమాజాన్ని నిర్మించిన మహిమాన్విత శక్తి స్వరూపిణి ఆమె. ఆవిడే జిల్లెళ్లమూడి అమ్మ. నాలుగక్షరాల అనసూయ తన అసలు పేరు. స్వస్థలం గుంటూరు జిల్లాలోని మన్నవ. 1923 మార్చి 28న సీతాపతి, రంగమ్మ అనే పుణ్యదంపతులకు జన్మించింది. ఆమెకు పదమూడవ ఏటనే అంటే 1936 మే 5న వివాహం జరిపించారు. భర్త పేరు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత దంపతులు జిల్లెళ్ళమూడికి వచ్చి స్థిరపడ్డారు.

ఎవరిని చూసినా బిడ్డగానే అనిపిస్తుంది అని తెలిపిన జిల్లెళ్ళమూడి అమ్మ విశ్వజనని. ఆమె మూర్తీభవించిన ప్రేమ దేవత. ఆత్మ స్వరూపాన్ని సమగ్రంగా అవగతం చేసుకున్నందునే ‘మీకు కానిది, నేను ఏదీ కాదు’, అని ఏనాడో ప్రకటించారు. విశ్వజననీ పరిషత్తు అనే సంస్థను 1971 ప్రాంతంలో ఆరంభించారు. అదే రోజున ఓరియంటల్ కాలేజీని ప్రారంభించారు. సంస్కృత విద్యాసంస్థలూ విస్తరించాయి. 1978వ సంవత్సరంలో వైద్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. సకలజన హితకర ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు. అందరూ కలిసి భోజనాలు చేసేలా, 1958 ఆగస్టు 15న శ్రీకారం చుట్టారు. ఏ పని చేపట్టినా అతిలోక మాతృత్వమే వ్యక్తమవుతుండేది. అన్నపూర్ణ మందిరంలో ఉన్న గాడి పొయ్యిని గుండె సమంగా పరిగణించేవారు. పిడికెడు బియ్యంతో ఎంతైనా చేయవచ్చని తన భావం, అనుభవం.

అనుదిన పఠనానికి వీలుగా ఓ వృద్ధురాలు మంత్రోపదేశం కోరగా మంత్రం కాదు ఓ సూత్రం చెబుతానంటూ, ఇంట్లోని వారినైనా, నీ ఇంటికి వచ్చిన వారితోనైనా సమానంగా వ్యవహరించు అని ప్రబోధించారు. చదవడం, చెప్పడం కాకుండా ఆచరించి మరీ చూపించు అని ముందడుగు వేయించారు. సరిగ్గా ఆ సమానత్వమే అమ్మ అందరింటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎవరు ఎప్పుడు వెళ్లినా, మొదట ఆదరించి అన్నం పెట్టేవారు. వారు వీరనే తేడాలుండేవి కావు. ఉన్నవారు, లేనివారన్న అంతరాలు మచ్చుకైనా కనిపించేవి కావు. సుమారు ఆరున్నర దశాబ్దాలు ప్రతి రోజూ భోజన వడ్డన, నిరంతర సమాదారణ. జీవనయానంలో ఏం చెప్పారో, ఆమె అదే చేశారు. ఎప్పుడూ పరిశ్రమించడమే తప్ప విశ్రాంతి అనేది తెలియని అమ్మకు కష్టసుఖాలను సమంగా చూడడమే మొదటి నుంచీ అలవాటు. చల్లని చూపు, చక్కని నవ్వు ఎందరెందరి హృదయ మందిరాల్లోనో పండువెన్నెలలు కురిపించాయి. పాతికేళ్ల వయసైనా రాకుండానే తిరిగిరాని లోకాలకు మరలివెళ్లిన తనయురాలి పేరిట హైమాలయం నిర్మింపజేశారు. ఇచ్చే అమ్మనే కానీ తీసుకునే అమ్మను కానని ఓ సందర్భంలో ప్రముఖ అభినేత్రికి బదులిచ్చారు.

అమ్మ అందించిన అన్నం ముద్దలు కేవలం మెతుకులు కావు. ప్రసాదగుణ సంపన్నమైన ఆశీరక్షతలు. ప్రతి మెతుకూ సంచిత ప్రారబ్ధాన్ని సమసింపజేసే దివ్య ఔషధమే. గడిచిన కాలంలో చరిత్రలో గురువులుగా, తాత్వికులుగా, సంప్రదాయ రక్షకులుగా, ధర్మ స్వరూపిణులుగా ఎందరో స్త్రీమూర్తులు వచ్చారు. నిండైన తల్లిదనంతో, వాత్సల్య చందనగంధంతో, కారుణ్య గుణంతో ఇంతటి పూర్ణత్వంతో రావడం అరుదు. అమ్మా! ఇంకొంత కాలం మీరుంటే బాగుంటుంది అని సద్గురు శివానందమూర్తిగారు కోరినప్పుడు, ‘రావడం, ఉండడం, పోవడం ఈ దేహానికే కానీ నాకేముంది? ఇవేమీ లేని ‘నేను’ ఎప్పుడూ ఉంటుంది అని అమ్మ సమాధానం ఇచ్చారు. నిత్యానందకరీ వరాభయకరీ అని మనం కొలిచే అన్నపూర్ణ స్వరూపిణి అయిన ఆ ఆదిపరాశక్తే ఈ అనసూయమాతగా జిల్లెళ్లమూడిలో వెలసింది. మహావైభవంగా సాగిన ఆమె భౌతిక అవతారం 1985 సంవత్సరం జూలై 12న ముగిసినా, ఇప్పటికీ తన భక్తుల ద్వారా అమ్మ ఆధ్యాత్మిక సౌరభాలను, అదే ప్రేమ, వాత్సల్యం, కరుణలను అందిస్తూనే ఉంది. అమ్మ గురించి తెలుసుకోదలచిన వారు విశ్వజనని ట్రస్టు ముద్రించిన ‘అమ్మ జీవిత మహోదధి’ అనే గ్రంథాన్ని చదువవచ్చు. మాతృపార్శ్వాన్ని ప్రపంచానికి రుచి చూపించిన మమతామూర్తి జిల్లెళ్ళమూడి అమ్మ అనుదిన వందనీయురాలు.