News

శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు

261views

శ్రీశైల క్షేత్రానికి కన్నడిగులు భారీగా తరలివస్తున్నారు. ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో వేలాది మంది భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో చేరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో క్షేత్ర వీధులు కిటకిలాడుతున్నాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులుదీరారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు కన్నడ భక్తుల కోసం విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేశారు. కన్నడ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.

దారి పొడవునా వడివడిగా అడుగులు వేసుకుంటూ కన్నడిగులు శ్రీగిరి వైపు సాగిపోతున్నారు. వారిలో కొందరు కాళ్లకు కర్రలకు కట్టుకుని నడుస్తూ భక్తిని చాటుతున్నారు. కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోట్‌ జిల్లా నీల్లోఖేరీ గ్రామానికి చెందిన కృష్ణగౌడు ఆరు అడుగుల ఎత్తైన కర్రలతో, మంజునాథ్‌ తల్వార్‌, మండేస్‌దేవూర్‌ శివ్‌దళ్వార్‌, హనుమంత్‌తల్వార్‌ నాలుగు అడుగుల ఎత్తైన కర్రలతో శ్రీశైలానికి వెళ్తున్నారు. తొమ్మిది రోజుల క్రితం బయలుదేరి దాదాపు 450 కి.మీ ప్రయాణించి జూపాడుబంగ్లా చేరుకున్నారు. మల్లన్న స్వామి తమ కోర్కెలు నెరవేర్చడంతో కర్రలపై నడుస్తూ మొక్కు తీర్చుకుంటామని వారు తెలిపారు.