
ముస్లింల పాలనలో భారతదేశంలో కేవలం 80 ఆలయాలను మాత్రమే వారు ధ్వంసం చేశారట. అంతకు మించి ఒక్క ఆలయాన్ని కూడా ముట్టలేదట. ఇది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉవాచ. మీకెవరికైనా సందేహాలు ఉంటే అమెరికా చరిత్రకారుడు రిచర్డ్ ఎం ఈటన్ పుస్తకం తిరగేయమని కూడా సలహా ఇచ్చారాయన. నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేశారంటూ ఎప్పుడు వీలైతే అప్పుడు వారు-విస్తృతార్థంలో బీజేపీవారు మీడియా ముందు చెబుతూ ఉంటారని, వారంతా ఆ అమెరికా చరిత్రకారుడి పుస్తకం ‘టెంపుల్ డెసిక్రేషన్ అండ్ ముస్లిం స్టేట్స్ ఇన్ మీడివల్ ఇండియా’ చదవాలని హోంవర్క్ కూడా ఇచ్చారు ఒవైసీ, ఆ 80 ఆలయాల కూల్చివేత క్రీస్తుశకం 11వ శతాబ్దం, 16 శతాబ్దం మధ్యనే జరిగిందని కూడా ఒవైసీ మాస్టారు ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. మిగతా కాలమంతా ముస్లిం పాలకులు అసలు హిందూ ఆలయాలకేసి చూడలేదని ఆయన మనలని నమ్మించాలని తపన పడుతున్నారు.
అంతేకాదు, ఉదారవాద, మార్పిస్టు చరిత్రకారులు చెప్పే పుష్యమిత్ర శుంగ కథను కూడా ఆయన గుర్తు చేశారు. పుష్యమిత్ర శుంగ అనేక బౌద్ధారామాలను ధ్వంసం చేశాడని ఒవైసీ చెప్పారు. పైగా పుష్యమిత్రుడి మీద ఎవరైనా సినిమా తీసే సాహనం చేయగలరా అంటూ సవాలు కూడా విసిరారు. చాళుక్యరాజు ఒకటో నరసింహవర్మ చాళు క్యుల రాజధాని వాతాపిలో ఉన్న గణేశ విగ్రహాన్ని తీసుకుపోయాడని, బోధివృక్షాన్ని శశాంక్ అనే పాలకుడు నరికిన సంగతి హ్యుయాన్ త్సాంగ్ రాశాడని ఒవైసీ మాస్టారు పాఠం చెప్పారు. సరే, ఈటన్ అనే అమెరికా చరిత్రకారుడు రాశాడు కాబట్టి మహమ్మదీయ పాలనలో 80 ఆలయాలు కూలాయన్న సంగతి ఒవైసీ ప్రగాఢంగా నమ్ముతున్నారు. మరి అదే అమెరికాకు చెందిన విల్ డ్యురాంట్ అనే చరిత్రకారుడు రాసిన పుస్తకాలు కూడా ఒవైసీ చదివితే బావుంటుంది. ముస్లింల విధ్వంసం ఎంతో ఆ చరిత్రకారుడు కూడా వివరించాడు కదా! ఆ సంగతి మాత్రం ఒవైసీ నోటి నుంచి ఊడి పడదు. ఒవైసీ వంటివారు, మార్క్సిస్టులు, ఉదారవాదులు తిమ్మిని బ్రహ్మిని చేయాలని చూస్తారు. వాస్తవం వారికి అక్కరలేదు. ఈ దేశంలో నలభయ్ వేల దేవాలయాలు ముస్లింలు కూలగొట్టారని ఎన్నో ఆధారాలు ఉన్నాయి. పైగా వీటికి ఆధారాలు ముస్లిం పాలకుల ఆత్మకథలలోను, విదేశీయాత్రికులు రాసిన కథనాలలోను కనిపిస్తున్నాయి.





