
అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలపై పాఠశాల దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు యువ విజ్ఞాన కార్యక్రమాన్ని (యువికా) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 23లోగా ఇస్రో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 7న ప్రకటిస్తారు. మే 18వ తేదీ నుంచి విద్యార్థులను ఆహ్వానించి 30వ తేదీ వరకు యువికా-2025 కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారని డీఈవో ఇ.నారాయణ తెలిపారు.
ఉచితంగా..
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులు 26,040 మంది ఉన్నారు. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా కల్పిస్తుంది. మే నెలలో 14 రోజుల పాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్లి ప్రయోగాలకు సంబంధించిన అంశాలను వివరిస్తారు.
ఏడు కేంద్రాల్లో నిర్వహణ..
దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ) కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఎంతో ఆసక్తికరం..
గతేడాది పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు శివరామకృష్ణలు నా పేరిట దరఖాస్తు పంపించారు. వారి సూచనలతో సిద్ధం కావడంతో యువికా కార్యక్రమానికి ఎంపికయ్యా. 15 రోజుల పాటు సూళ్లూరుపేట కేంద్రంలో ఉన్నా. అంతరిక్షానికి సంబంధించిన వింతలు, గ్రహాల సముదాయం విశేషాలు, శాటిలైట్లు, రాకెట్ల తయారీ, ప్రయోగాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నా. శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడటంతో కొత్త విషయాలు తెలిశాయి.
-మరపట్ల రత్నకుమారి, విద్యార్థిని, దండగర్ర జడ్పీ ఉన్నత పాఠశాల





