
ఎన్టీఆర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వరకు కొనసాగుతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నెమలి కృష్ణుడిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు.
నయన మనోహరం.. తెప్పోత్సవ విహారం
ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన నెమలి కృష్ణుని తిరుకల్యాణం నిర్వహిస్తారు. నీలమేఘశ్యాముని బ్రహ్మోత్సవాలకు ఆలయానికి రంగులు వేసి విద్యుద్దీపకాంతుల్లో వర్ణశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు వేణుగోపాలుడిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 13న సాయంత్రం శేషవాహన మహోత్సవం, రాత్రి ఎదురుకోల ఉత్సవం, 14న రాత్రి 10 గంటలకు రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి తిరుకల్యాణ వేడుక నయన మనోహరంగా నిర్వహిస్తారు. 15న రథోత్సవం, 16న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పల్లకీ ఉత్సవం, రాత్రి కోనేరులో తెప్పోత్సవం, 17న ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయ ప్రధానార్చకులు తిరునఘరి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఏటా నెమలి ఆలయ ప్రాంగణంలో కూడా ఉత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశం సోమవారం వరకు నిర్వహించలేదు. నాలుగు రోజుల కిందట తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమన్వయం సమావేశం నిర్వహించారు.
స్వయంభువుగా వెలసి
1953 మార్చి 23న (శ్రీరామనవమినాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభువుగా వెలిశారు. గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య తన పొలానికి సారవంతమైన మట్టి కోసం దారా నర్సయ్యకు చెందిన భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిలో తన వద్ద పనిచేసే కఠారు వెంకటేశ్వర్లుతో మట్టి తవ్విస్తుండగా స్వామి విగ్రహం బయటపడింది. అదే సమయంలో గడ్డపార తగిలి స్వామి చిటికెన వేలు విరిగిపోగా వెండితో సరిచేశారు. భూమిలో లభించిన నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో 1957 ఫిబ్రవరి 6న (రథోత్సవంనాడు) శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. 1958 నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏటా వైభవంగా నిర్వహిస్తున్నారు.





