
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ దీనిపై ఎంపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, ప్రముఖ వితరణశీలి సుధామూర్తి (Sudha Murthy) దీనిపై మాట్లాడుతూ.. త్రిభాషా సూత్రాని (Three-Language Policy)కి మద్దతు పలికారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడం పిల్లలకే మంచిదన్నారు.
‘‘ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలని సూచిస్తాను. నాకు 7-8 భాషలు వచ్చు. నేర్చుకోవడాన్ని నేను చాలా ఇష్టపడతా. పిల్లలు కూడా దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు’’ అని సుధామూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందీ వివాదం వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
త్రిభాషా సూత్రం అమలుపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దీనిపై మాట్లాడుతూ.. ‘‘ద్విభాషా పద్ధతిపై తమిళనాడు చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచ శాస్త్ర, సాంకేతికత, వాణిజ్య విధానాలతో అనుసంధానం కోసం ఆంగ్లం నేర్చుకోవాలి. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం కోసం తమిళం ఉండాలి. ఒకవేళ మూడో భాషను నేర్చుకోవాలంటే అది విద్యార్థుల అభీష్టానికి వదిలేయాలి. అంతేగానీ.. తప్పనిసరి అంటూ బలవంతంగా రుద్దకూడదు. కేంద్రం చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని అన్నారు.
అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తిప్పికొట్టారు విద్యార్థులు చదువుకునే హక్కును హరించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. విద్యా విధానాల అమలు విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు.





