NewsProgramms

ఆర్ సి ఈ పి ఒప్పందం దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు – స్వదేశీ జాగరణ్ మంచ్.

86views

ప్రాంతీయ దేశాల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్ సి ఈ పి) దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిలభారత సహ సంఘటన ప్రముఖ్ శ్రీ శంకర్ పాణిగ్రాహి పేర్కొన్నారు. గురువారం సి జే ఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం ఆమోదించే దిశగా ఉన్నదని, అదే జరిగితే భారతదేశంలోని పారిశ్రామిక, వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, విదేశీ ఉత్పత్తులు దేశంలోకి సులువుగా ప్రవేశించి, స్వదేశీ ఉత్పత్తులను దెబ్బతీస్తాయని ఆందోళన వెలిబుచ్చారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుండి దిగుమతి సుంకం లేకుండా పాల ఉత్పత్తులు వెల్లువెత్తితే పాడి పరిశ్రమపై ఆధారపడి జీవించే 10 కోట్ల మంది భారతీయులు కష్టాలపాలు అవతారన్నారు.

ఆర్ సి ఈ పి ని అడ్డం పెట్టుకుని 90 శాతం చైనా ఉత్పత్తులు దేశంలోకి దిగుమతి అయితే పెద్ద మొత్తంలో దేశీయ పారిశ్రామిక సంస్థలు మూసివేయ వలసి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఒప్పందం వలన మన దేశ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయని, తద్వారా చిన్న చిన్న మదుపరుల పెట్టుబడులతో నడుస్తున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ స్ఫూర్తితో ఇప్పుడిప్పుడే ముందుకెళుతున్న “మేక్ ఇన్ ఇండియా” విధానానికి ఈ ఒప్పందం తూట్లు పొడిచేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఒప్పందం విషయంలో సంప్రదింపులు జరుపుతున్న అధికారులే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం చేసుకునే దిశగా ప్రభుత్వం ఏ మాత్రం ముందడుగు వేసినా స్వదేశీ జాగరణ్ మంచ్ దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అనంతరం స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధులు  కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు .

ఈ కార్యక్రమంలో శ్రీ శంకర్ పాణిగ్రాహి తోపాటు స్వదేశీ జాగరణ్ మంచ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ శ్రీ సాగి నరసింహ రాజు, ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీ బొమ్మ హరికృష్ణ, విశాఖపట్నం కో కన్వీనర్ శ్రీ గడి దాసు గోపి నరేంద్ర మరియు ఇతర స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.