News

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

221views

మహా శివరాత్రి నేపథ్యంలో మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం లక్షలాది మంది తరలివస్తుంటారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడిపేలా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొరుగు జిల్లాల నుంచి అదనపు బస్సులు రప్పిస్తున్నారు. గతేడాది 382 బస్సులు నడపగా.. ప్రస్తుతం 453 బస్సులు నడిపేలా ప్రజా రవాణా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఉమ్మడి కర్నూలు నుంచి 198 బస్సులతోపాటు అనంతపురం 60, శ్రీ సత్యసాయి 45, వైఎస్సార్‌ 10, నెల్లూరు 60, చిత్తూరు 20, తిరుపతి 40, అన్నమయ్య జిల్లా నుంచి 20 బస్సులను ప్రజా రవాణా అధికారులు తెప్పిస్తున్నారు.

రద్దీకి అనుగుణంగా..
శివరాత్రి నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలంతో పాటు మహానంది, యాగంటి, ఓంకారం, గుండ్ల బ్రహ్మేశ్వరం, నగరంలోని జగన్నాథగట్టు, సంగమేశ్వరం తదితర శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివెళుతుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు.

బృందాల ఏర్పాటు
కర్నూలు నుంచి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి కర్ణాటక భక్తులు తిరుగు ప్రయాణం సాగించాలంటే చేయాలంటే దోర్నాల ఘాట్‌ మీదుగా రావాల్సి వస్తుంది. ఈ ఘాట్‌లో బస్సు ఆగిపోతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో బస్సుల కండీషన్‌ మెరుగుపరిచేందుకు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆర్టీసీకి చెందిన సీనియర్‌ మెకానిక్‌ల బృందం దోర్నాల ఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు పరిశీలిస్తుందని ప్రజా రవాణా శాఖ అధికారులు తెలిపారు. బస్సుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

సాధారణ ఛార్జీలే
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలానికి 198 బస్సులు సిద్ధంగా ఉంచాం. వీటితో పాటు పొరుగు జిల్లాల నుంచి అదనంగా బస్సులు తెప్పిస్తున్నాం. బస్సుల కండీషన్‌ తనిఖీ చేసిన తర్వాతే బయటకు పంపుతాం. ఘాట్‌ రోడ్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెకానిక్, ట్రాఫిక్‌ బృందాలు నిత్యం పర్యవేక్షిస్తాయి. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుపుతాం.– జి.శ్రీనివాసులు, రజియాసుల్తా, కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజా రవాణాధికారులు