
వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జీర్ణోద్ధరణ పనులు ముగియనున్న నేపథ్యంలో మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించాలని టిటిడి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జేఈవో వి.వీరబ్రహ్మంతో చర్చించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల 5న సాయంత్రం 5.30 గంటలకు శాస్త్రోక్తంగా పూజలకు అంకురార్పణ చేయనున్నారు. 6న ఉదయం 7.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, హోమాలు, పుర్ణాహుతి నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు సహస్ర కలశాధివాసం, వేదపారాయణం తదితర ఘట్టాలు జరుగుతాయి. రెండో రోజు 7న శుక్రవారం ఉదయం ప్రత్యేక హోమాలు, విమాన గోపురం ఛాయాస్నపనం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లకు అనుమతిచ్చారు. మూడో రోజు 8న శనివారం ఉదయం సహస్ర కలాభిషేకం, పుర్ణాహుతి, సాయంత్రం ప్రధాన మూర్తి హోమం, అష్టబంధన సమర్పణ, మహాశాంతి అభిషేకం క్రతువు జరుగుతుంది. నాలుగో రోజు 9వ తేదీ ఆదివారం ఉదయం 10.15 నుంచి 11.30 గంటల వరకు మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.





