News

మహాకుంభమేళాలో ముగ్గురు శంక‌రాచార్యుల భేటీ…

300views

గోవధ నిషేధించాలని ధర్మాదేశం
గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానం
స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు కృషి చేయాలని పిలుపు

ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మహా కుంభ‌మేళాలో అద్భుతఘట్టం చోటుచేసుకుంది.జగద్గురువు శ్రీ శంక‌రాచార్యులు వారు స్థాపించిన పీఠాలకు చెందిన ముగ్గురు శంకరాచార్యులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. సనాతన ధర్మ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. ముగ్గురు శంకరాచార్యులు కలిసి సనాతన ధర్మ రక్షణ కోసం కీలక తీర్మానాలు చేశారు. గో వ‌ధ‌ను నిలిపివేయాలని ధ‌ర్మాదేశం ఇచ్చారు. అలాగే గోవును దేశ‌మాత‌గా ప్ర‌క‌టించాల‌ని తీర్మానం చేయగా సమావేశానికి హాజరైన వారు కరతాళధ్వనులతో ఆమోదించారు.

దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, స‌నాత‌న సంప్ర‌దాయ ప‌రిర‌క్ష‌ణ‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను పేర్కొన్నారు. కుంభ‌మేళా స‌మ‌యంలో ప్ర‌యాగ్‌రాజ్ కు ప్రతీ ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు.

దేశంలోని మూడు ఆమ్నాయ పీఠాలకు చెందిన శంక‌రాచార్య‌లు భేటీ కావ‌డం ఇదే మొద‌టిసారి. శృంగేరి శార‌దా పీఠం విధు శేఖ‌ర భార‌తి, ద్వారకా పీఠానికి చెందిన స‌దానంద స‌ర‌స్వ‌తి, జ్యోతిర్ మ‌ఠానికి చెందిన అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

స‌నాత‌న సంస్కృతి వృద్ధి, ర‌క్ష‌ణ‌పై 27 మార్గ‌ద‌ర్శ‌కాలు విడుదల చేశారు. సంస్కృత భాష ప్రాముఖ్య‌త‌పై దృష్టి పెట్టాల‌ని శంక‌రాచార్య స‌దానంద స‌ర‌స్వ‌తి సూచించారు.
గోవును దేశ‌మాత‌గా గుర్తించాల‌ని కోరుతూ శృంగేరి పీఠాధిప‌తి విధు శేఖ‌ర భార‌తి తీర్మానించారు. సంస్కృత విద్య కోసం కేంద్రం నిధుల్ని కేటాయించాల‌ని అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి తెలిపారు.