ArticlesNews

గోదావరి టు గంగ… అక్కడ కుంభమేళా… ఇక్కడ పుష్కరాలు

18GG…ï³05: Vø§éÐ]lÇ ç³#çÙPÆ>Ë$ (OòœÌŒæ)
334views

గంగా.. గోదావరి. ఒకటి ఉత్తర భారతదేశం… మరొకటి దక్షిణ భారతదేశం. దిక్కులు వేరైనా రెండింటికీ చాలా దగ్గర బంధం ఉంది. వీటి చుట్టూ రామాయణ, మహాభారత పురాణ గాథలున్నాయి. హిందువులకు సంబంధించి ఈ రెండు నదులను ఆనుకుని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటి వద్ద స్నానమాచరిస్తే పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తే, గంగకు సైతం 12 ఏళ్లకు పూర్ణ కుంభమేళా జరుగుతోంది. చనిపోయిన వారి అస్తికలు ఈ రెండు నదుల్లో కలపడం కూడా పుణ్యంగా భావిస్తారు. ఇవన్నీ చూసే గోదావరిని దక్షిణ గంగగా సంబోధిస్తారు. మహా కుంభమేళా క్రతువును వీక్షించేందుకు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేలాది మంది గోదావరి వాసులు ప్రయాగరాజ్‌ బాట పట్టారు. కుంభమేళా సందర్భంగా నదిలో నిర్వహించే పూజలు.. నదిని ఆనుకుని చేసే యజ్ఞాల్లో గోదావరి జిల్లాలో పండే కొబ్బరి.. పోక కాయల వంటివి ప్రముఖ స్థానంలో ఉంటాయి. తద్వారా గంగ, గోదావరి అనుబంధం మరోసారి తేటతెల్లం అవుతోంది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులు నదీ, సముద్ర పుణ్యస్నానాలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాల్లో ఒక్క చోట అని కాకుండా గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రతి ఘాట్‌ వద్ద పుణ్య స్నానాలు చేయడం సర్వసాధారణం. ఇది కాకుండా భీష్మ ఏకాదశి, చొల్లంగి అమావాస్య, అంతర్వేది కల్యాణోత్సవాల వంటి సమయాల్లో సముద్ర స్నానాలు చేసి పాప పరిహారం జరిగిందనుకుంటారు. వీటితో పాటు దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమున, సింధు, నర్మద, మహానది, కావేరి, కృష్ణ వంటి నదుల్లో పుణ్య స్నానాలకు సైతం భక్తులు తరలి వెళ్తారు. ఈసారి ప్రతి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా కావడంతో ప్రయాగరాజ్‌ వద్ద స్నానాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం నుంచి ప్రయాగరాజ్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. మరి కొంతమంది భక్తులు, హిందూ సంఘాల వారు బస్సులు ఏర్పాటు చేసుకుని మహా కుంభమేళాకు తరలివెళ్తున్నారు. సంక్రాంతి పండగ ముగియడంతో గోదావరి జిల్లాల నుంచి దీనికి వెళ్లేవారి సంఖ్య మరింత పెరగనుంది.

అక్కడ కుంభమేళా… ఇక్కడ పుష్కరాలు
గంగ, గోదావరికి ఉన్న పోలికల్లో కుంభమేళా.. పుష్కరాలు ఒకటి. దేశంలోని ప్రధాన నదులన్నింటిలోనూ ప్రతి 12 ఏళ్లకు పుష్కరాలు జరుగుతుంటాయి. కానీ గంగకు సాధారణ కుంభమేళా (నాలుగేళ్లకు), అర్ధ కుంభమేళా (ఆరేళ్లకు), పూర్ణ కుంభమేళా (12 ఏళ్లకు), మహా కుంభమేళా (144 ఏళ్లకు) ఒకసారి జరుగుతుంది. గోదావరికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. గతంలో 2015లో జరిగిన పుష్కరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం పన్నెండు పుష్కరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరంగా ప్రచారం చేసింది. కుంభమేళా, గోదావరి పుష్కరాలకు మాత్రమే కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తుంటారు. గోదావరికి సైతం 2027లో పుష్కరాలు రానున్నాయి. గతంలో 2015లో జరిగిన పుష్కరాలలో సుమారు 10 కోట్ల మందికి పైగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రధాన ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు చేశారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరగనుందని అంచనా. గంగా నదిని ఆనుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి (కాశీ), గయ, హరిద్వార్‌, హృషీకేశ్‌, అలహాబాద్‌లు ఉండగా, గోదావరిని ఆనుకుని నాసిక్‌, బాసర, కాళేశ్వరం, భద్రాచలం, రాజమహేంద్రవరం, కొవ్వూరు, అంతర్వేది, కోటిపల్లి, మురమళ్ల, అప్పనపల్లి వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వారణాసిలో గంగా హారతి, రాజమహేంద్రవరంలో గోదావరి హారతి ప్రత్యేకత చాటుతున్నాయి.

కుంభమేళాలో కోనసీమ కొబ్బరి.. వక్క
కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌తో పాటు త్రివేణీ సంగమ ప్రాంతంలో జరుగుతున్న పూజలు, యజ్ఞాల్లో గోదావరి జిల్లాల్లో పండుతున్న కొబ్బరి, పోక (వక్క) ప్రధాన సామగ్రి అయ్యాయి. గంగతోపాటు ఉత్తరాదిలో నదుల్లో పువ్వులు, పత్రి, కొబ్బరి కాయలను వదలడం అక్కడి వారికి ఆనవాయితీ. దీంతో గోదావరి జిల్లాల నుంచి కురిడీ కొబ్బరి కుంభమేళాకు ఎగుమతి అవుతోంది. అలాగే యజ్ఞాలు, హోమాల్లో పచ్చి వక్క (పోక కాయలను) వాడుతుంటారు. ఇవి కూడా గోదావరి జిల్లాల రైతుల నుంచి వ్యాపారులు సేకరించి మహా కుంభమేళాకు పంపుతున్నారు.