
ఇటలీకి చెందిన ముగ్గురు మహిళలు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. మహా కుంభమేళాలో జరిగిన తమ అనుభవాలను యోగితో పంచుకున్నారు. మహా కుంభమేళా కేవలం మతపరమైనదే కాకుండా, సాంస్కృతిక ధృక్కోణం కూడా ఇమిడి వుందని విదేశీయులు సీఎంతో పేర్కొన్నారు. తమ ప్రయాణంలో హిందూ ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకున్నామని, దానిని తమ జీవితంలో భాగం చేసుకుంటామని నిర్ణయించుకున్నామని తెలిపారు. మరోవైపు సీఎం యోగి ముందు విదేశీయులు రామాయణం చౌపాయి, శివ తాండవ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేశారు.
ఈ మహిళల్లో ఒకరు ‘మంగల్ భవన్ అమంగళ్ హరి’ చౌపాయి పాడగా, మరికొందరు శివ తాండవ స్తోత్రం మరియు మహిషాసుర మర్దిని స్తోత్రాలను పారాయణ చేశారు. ఇది సీఎం యోగిని, అక్కడున్న ఇతర అధికారులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా వీరందర్నీ సీఎం యోగి అభినందించారు. ఈ మహిళలకు హిందీ లేదా సంస్కృతంలో లోతైన జ్ఞానం లేకపోయినా ఆసక్తితో నేర్చుకున్నారని అభినందించారు.
మరోవైపు కుంభమేళా ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఇటలీ మహిళలు చెప్పుకొచ్చారు. నాగ సాధువులు, సాధువులు, భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు… ఇలా అన్నీ తమను ఎంతగానో ఆకర్షించాయని, భారతీయ సంప్రదాయాలు అత్యద్భుతంగా వున్నాయన్నారు. అలాగే తాము హిందూ ధర్మం పట్ల ఆకర్షితులమయ్యామని, సనాతన ధర్మాన్ని స్వీకరించి, నాగ సాధువులు కావాలని నిర్ణయించుకున్నట్లు కూడా పేర్కొన్నారు.
అంతేకాకుండా వెంటనే శ్రీపంచ దశనం జూనా అఖారా ద్వారా అధికారికంగా సన్యాస దీక్షను పొందారు. గంగానదిలో స్నానం చేసి, సన్యాస నియమం ప్రకారం శిరోముండనం చేయించి, దీక్షా వస్త్రాలను ఇచ్చారు. తర్వాత పిండ ప్రదానం చేశారు. దీంతో వారి ఇటలీ పేర్లు పోయి, సన్యాస దీక్షా పేర్లు వచ్చాయి. మరియ్ అనే మహిళకి కామఖ్య గిరి అని, బంకియాకి శివానీ భారతి అని, మోక్షితా రాయ్ కి మోక్షత గిరి అని సన్యాస నామాలను ఇచ్చారు.