
( జనవరి 23 – సుభాష్ చంద్రబోస్ జయంతి )
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈ రోజు అంటే జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి. 2021 సంవత్సరంలో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. అయితే దీనికి నాలుగేళ్ల క్రితమే సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943 అక్టోబరు 21న భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే బోస్ సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని స్థాపించారు. తాను చేపట్టిన ఈ చర్యతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం సాగదని వారికి బోస్ సందేశం ఇచ్చారు.
పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్యశృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని సిద్ధాంతీకరించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. విజయసాధన కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తియుక్తులను, సర్వస్వాన్ని ఫణంగా పెట్టిన త్యాగశీలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897వ సంవత్సరం జనవరి 23న, ఒడిశాలోని కటక్‌లో జన్మించారు. అతని తల్లి పేరు ప్రభావతి, తండ్రి పేరు జానకీనాథ్ బోస్. చిన్నప్పటి నుంచి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించి చదువులో రాణిస్తూ…నేతాజీ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ కాలంలో అత్యున్నతమైన ఉద్యోగాల కోసం జరిపే ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన బోస్ ఉన్నతమైన ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ వదులుకొని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేందుకు భారతదేశానికి తిరిగి వచ్చేశారు. ‘‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’’ అనే అతని ప్రసిద్ధ నినాదం దేశభక్తిని ప్రేరేపిస్తుంది.
సుభాష్ చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్ వేల్స్ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్ ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవారు. చౌరిచౌరా సంఘటన నేపథ్యంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేయడాన్ని బోస్ తప్పుబట్టారు. ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1935 భారత ప్రభుత్వ చట్టంలోని లోపభూయిష్టమైన ఫెడరల్ వ్యవస్థతో పాటు ఇంకా అనేక అంశాలను విమర్శించారు. ఆ తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ బేధాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ‘‘నా స్థానంలో మరొక అధ్యక్షునితో తమ పోరాటం మరింత ఉన్నతంగా జరగగలదని భావిస్తే, నా పదవీ త్యాగానికి సిద్ధమే..దేశం కోసం నా శరీరంలోని చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతా,” అని ప్రకటించి ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను బోస్ ఏర్పాటు చేశారు.
ఫార్వర్డ్ బ్లాక్ మహాసభ 1940వ సంవత్సరంలో నాగ్‌పూర్‌లో జరిగింది. అదే సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు బోస్‌ని గృహనిర్బంధంలో ఉంచారు. ఆయన వారి కళ్ళుగప్పి మారువేషంలో కలకత్తా నుంచి కాబుల్‌కి, అక్కడ నుంచి బెర్లిన్ చేరారు. రెండో ప్రపంచ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వ్యతిరేకులైన హిట్లర్, రిబ్బన్ ట్రాప్ లాంటి జర్మన్ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరారు. బెర్లిన్ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చే భిక్ష కాదు అది యుద్ధం చేసి సాధించుకోవాల్సిన హక్కు అని ఎలుగెత్తి చాటిన నాయకుడు నేతాజీ. భారతీయుల సైన్యం ఆజాద్ హిందూ ఫౌజ్ – ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి శిక్షణ ఇచ్చి “జై హింద్” అనే ఉత్తేజపూరితమైన నినాదాన్ని, మొట్టమొదటి స్వాతంత్ర్య భారత ప్రభుత్వాన్ని అండమాన్‌లో ఏర్పాటు చేసిన ఘనత మన నేతాజీదే.
దేశం కోసమే బతికిన సుభాష్ చంద్రబోస్ మరణం నేటికీ రహస్యంగానే మిగిలిపోయింది. 1945 ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. కానీ, నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నేతాజీ వల్లనే, ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటం వల్లనే, వారి విజయాల వల్లనే బ్రిటిష్ వారి వెన్ను వణికి, స్వాతంత్ర్య ప్రకటన చేశారని డా.అంబేద్కర్ అన్నారు. ఇది నిర్వివాదాంశం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో నడుస్తూ, ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయాలి. ఇదే నేతాజీకి మనం అందించే గౌరవం.