News

ఇది మన దేశం, దీని సంక్షేమం మన బాధ్యత.

735views

జమ్మూకశ్మీర్‌లో ప్రజలు తమకు తాము విధించుకున్న స్వీయ నిర్బంధం నుంచి బయటికి రావాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం దాదాపు అన్ని ప్రాంతీయ దినపత్రికల్లో మొదటి పేజీ ప్రకటన ఇచ్చింది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు బయటికి రాకపోవడాన్ని ప్రభుత్వం అభివృద్ధి నిరోధక చర్యగా అభివర్ణించింది. అధికరణ 370రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని దశలవారీగా ఎత్తివేస్తూ వచ్చింది. కానీ, ఉగ్రవాదులు మాత్రం ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని.. పూర్తి స్థాయి బంద్‌ పాటించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు స్వీయ నిర్బంధం విధించుకొని ఇళ్లలోనే ఉండటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కశ్మీర్‌లో ఇంకా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం ప్రజలు బయటికి రావాలని కోరుతూ ప్రకటన ప్రచురించింది.

ఉగ్రవాదులకు లొంగిపోదామా? అంటూ ప్రకటనలో ప్రభుత్వం ప్రజల్ని ప్రశ్నించింది. 70 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని.. విష ప్రచారంలో మగ్గిపోయారని పేర్కొంది. ఓవైపు వేర్పాటువాద నేతల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యసిస్తుంటే ఇక్కడి వారు మాత్రం ఉగ్రవాదం, హింస, పేదరికంతో అనేక బాధలు అనుభవించారన్నారు. అమాయక యువకుల్ని రెచ్చగొట్టి ఉగ్రవాదంలోకి లాగుతున్నారని వివరించారు. ఇప్పటికీ అదే వైఖరిని అనుసరిస్తూ.. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ఇంకా అదే బెదిరింపులకు లొంగిపోదామా? మన వ్యాపారాల్ని స్తంభింపజేసుకుందామా? మన జీవనాధారాన్ని నిలిపేసుకుందామా? మన పిల్లల విద్య తద్వారా వారి భవిష్యత్తును అడ్డుకుందామా?’ అని ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. ‘ఇది మన దేశం, దీని సంక్షేమం మన బాధ్యత. భయమెందుకు’ అని చివరగా ప్రజలకు అభయమిచ్చారు.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.