
మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం పోవాలని… చిన్న గుడి నుంచి తిరుమల వెంకన్న ఆలయం వరకు అన్నింటికీ స్వయం ప్రతిపత్తి కల్పించి.. వాటి నిర్వహణను హిందువులకే అప్పగించాలని స్వామీజీలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు కోరారు. హిందూధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు.. అన్ని రాష్ట్రాల్లో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణాజిల్లా కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం ‘హైందవ శంఖారావం’ భారీ సభ నిర్వహించారు. దీనికి పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. వీహెచ్‌పీ అఖిలభారత అధ్యక్షుడు ఆలోక్‌కుమార్, ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కొండవీటి జ్యోతిర్మయి, ఇతర ప్రముఖులు హిందూ సమాజాన్ని కార్యోన్ముఖుల్ని చేసేలా ప్రసంగించారు. దేవాలయాలు హిందూ సమాజానికి మూలస్తంభాలని, వీటిపై దాడులు జరగడం బాధాకరమన్నారు. 130 కోట్ల మంది భారతీయులను జైశ్రీరామ్ అనే నినాదం బయటకు రప్పించిందని… ఆ క్రమంలోనే అయోధ్యలో రామమందిరం సాకారమైందన్నారు. హిందూ ధర్మరక్షణలో అన్ని వర్గాలనూ భాగస్వాములను చేసేలా తదుపరి కార్యాచరణ ఉండాలని డిక్లరేషన్ ప్రకటించారు. ఈ స్ఫూర్తి క్షేత్రస్థాయిలోనూ కొనసాగించేలా సభకు వచ్చినవారితో చినజీయర్‌స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ___________________________________
ఆదాయం.. హిందూ ధర్మరక్షణకే
బ్రిటిష్ ప్రభుత్వం హిందూ మందిరాలను తమ చేతుల్లోకి తీసుకుంది. ఇతర మతాల వాటిని తీసుకోలేదు. టిటిడి సొమ్మును ఆడిట్, కామన్ గుడ్‌ఫండ్, నిర్వహణ పేరుతో తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. మన మందిరాలు తిరిగి హిందూ సమాజం చేతికి రావాలి. హిందూ సమాజమే నిర్వహించాలి. ఇందులో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఉండాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఉండాలి. ఆలయాల ఆదాయం హిందూ ధర్మం కోసమే వెచ్చించాలి. అర్చకులకు గౌరవం ఉండాలి.
ఆలోక్‌కుమార్, వీహెచ్‌పీ జాతీయాధ్యక్షుడు
___________________________________
లౌకికవాదమంటూ ఆలయాలు గుప్పిట్లోకి..
లౌకికవాదం అంటూ హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. ఆలయాలను వ్యాపార, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాయి. ఆలయాల నిర్వహణ హిందువులతోనే జరగాలి. దీని కోసమే జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దేవాలయాల ఆస్తులను కాపాడుకోవాలి.
గోకరాజు గంగరాజు, వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు
___________________________________
దేవాదాయ చట్టాన్ని రద్దుచేయాలి
గతంలో దేవాదాయ, ధర్మాదాయ చట్టం అనే విషసర్పాన్ని సృష్టించి దేవాలయాలపైకి వదిలారు. అది కొండచిలువగా మారి వ్యవస్థను మింగేస్తోంది. దేవాదాయ చట్టంతో అర్చకులు వీధిపాలయ్యారు. అర్చకవృత్తి శాశ్వతమైన బాధ్యత. దానికి బదిలీ, పదవీవిరమణలు ఉండవని ఆగమశాస్త్రం చెబుతోంది. దేవాలయాల రక్షణకు ఇలాంటి చట్టాలతో తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఈ చట్టాన్ని ప్రభుత్వం రద్దుచేయాలి.
ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ సీఎస్
___________________________________
అయోధ్యలో ప్రభుత్వ జోక్యం లేదు
అయోధ్య రామమందిర నిర్వహణ, పూజావిధానాలు, ఉత్సవాల నిర్వహణ, అర్చకుల ఎంపిక అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎక్కడా ప్రభుత్వ జోక్యం లేదు. నేడు విశ్వ సాంస్కృతిక కేంద్రంగా అయోధ్య వెలుగొందుతోంది..
గోవింద దేవగిరి స్వామీజీ, అయోధ్య రామాలయ తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి
___________________________________
ఆలయాల్ని ప్రభుత్వం నిర్వహించడమనే చెడు సంప్రదాయం దేశంలో నడుస్తోంది. దీన్ని నిర్మూలించే అంశం గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను కలిసి వివరించాం. ఎన్నో ఏళ్ల సంఘర్షణ తర్వాత కూడా మన ధర్మం, సంస్కృతి సురక్షితంగా ఉన్నాయంటే ఆలయాలే కారణం. సమాజంలో పెరుగుతున్న లవ్‌జీహాద్, మతాంతరీకరణ లాంటి అశాంతులకు పరిష్కారం ఆలయాల్లోనే ఉంది.
మిళింద్ శ్రీకాంత పరాండే, వీహెచ్‌పీ అఖిలభారత ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్
___________________________________
ఆలయాల నిర్వహణ మనకు చేత కాదా?
ఏపీలో ఒకప్పుడు ఆలయాలకు 15లక్షల ఎకరాలున్నాయి. దేవాదాయశాఖ చేతుల్లోకి వెళ్లాక నాలుగున్నర లక్షల ఎకరాలు మిగిలాయి. పూజ ఐదు నిమిషాలు చేయాలో… అరగంట చేయాలో అధికారులు చెబుతారా? మనం కట్టుకున్న ఆలయాల్ని నిర్వహించడం మనకు చేత కాదా? చిన్న ఆలయమైనా… తిరుపతి అయినా ఆయా సంప్రదాయాల ప్రతినిధుల ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు. నాయకులు, అధికారులే ఆలయ ఆస్తుల్ని, ఆచారాల్ని పాడుచేస్తున్నారు. తిరుపతి లాంటి ఆలయాల్లో ఛైర్మనో, సభ్యుడో, అధికారులో గొప్పవారికి వీఐపీ దర్శనాలు చేయించి.. సామాన్యులను రోజుల తరబడి ఎదురుచూసేలా చేస్తున్నారు. ‘ఆయన’ హయాంలో 4.5 లక్షల మందికి వీఐపీ దర్శనాలు చేయించారు. ఇలా చేస్తే మనవాళ్లు ఇతర మతాల్లోకి పోకుండా ఏం చేస్తారు?
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి
___________________________________
సంప్రదాయాలను రక్షించుకుందాం
హిందూమతంలో పుట్టడం మన అదృష్టం. గతంలో ఎందరో దాతలు, రాజులు నిర్మించిన ఆలయాల ఆస్తులను రక్షించుకునే బాధ్యత మనందరిదీ. మన సంప్రదాయాలను రక్షించుకోవాలి. నూతన సంవత్సర వేడుకలు, కేకులు కట్ చేయడం, కొవ్వొత్తులు ఆర్పడం తగదు. హైందవ శంఖారావం లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నా.
గణపతి సచ్చిదానంద, దత్తపీఠాధిపతి
___________________________________
సినిమాల్లోనూ హైందవ ధర్మంపై దాడి
కొన్ని సినిమాలు హిందూ ధర్మానికి కళంకం తెస్తున్నాయి. ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ హిందూ సమాజానికి సినీరంగం తరఫున క్షమాపణలు కోరుతున్నా. సినిమాల్లో వినోదం కోసం వ్యాస, వాల్మీకి రామాయణాలను వక్రీకరించారు. కొన్నేళ్ల ముందు వచ్చిన చిత్రాల నుంచి ఇటీవలి ‘కల్కి’ వరకూ కర్ణుడి పాత్రకు ఆపాదించిన గొప్పదనాన్ని చూసి సిగ్గుపడుతున్నా. వాల్మీకి రామాయణంలో రాయి ఆడది అయినట్లు, రాముడు, లవకుశల మధ్య యుద్ధం జరిగినట్లు చిత్రీకరణకు అనువుగా ఎన్నో వక్రీకరణలు చేశారు. మనం ఊరుకుంటే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. ఇస్కాన్ వారి నినాదం హరేకృష్ణ హరేరామ్ నినాదాన్ని ఐటమ్ సాంగ్‌గా వాడుకున్నారు. ఓ సినిమా పాటలో బ్రహ్మాండనాయకుడు అనే హిందూపదాన్ని వాడినందుకు ఒక సంగీత దర్శకుడు ఆ పాట చేయనన్నారు. జీవితాంతం ఆయన చేసే సినిమాలకు పాటలు రాయనని చెప్పి వచ్చేశా.
అనంత శ్రీరామ్, సినీ గేయ రచయిత
___________________________________
సభలో వీహెచ్‌పీ కేంద్రీయ సంఘటన మహా మంత్రి కోటేశ్వరశర్మ.. హిందూ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అంశాలు ఇవీ..
• దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా చట్ట సవరణ చేయాలి
• హిందూ సమాజం, ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి
• హిందువుల పండగలపై ఆంక్షలు, ఆర్థిక భారాలు విధించకూడదు
• ఆలయాల్లో అన్య మతస్థులను తొలగించాలి
• దేవాలయ బోర్డుల్లో రాజకీయాలకు అతీతంగా ధార్మిక భావాలు ఉన్నవారినే నియమించాలి
• అన్యాక్రాంతమైన ఆలయాల ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకోవాలి
• ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని హిందూ ధర్మ ప్రచారానికి, సేవా కార్యక్రమాలకే వినియోగించాలి
• పూజ, ప్రసాద కైంకర్యాలను అత్యంత నాణ్యత, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి





