ArticlesNews

అమ్మకు ప్రతిరూపం ప్రకృతి

218views

ప్రకృతిలో ఏ రుతువుకారుతువు అందాలను ఆరబోస్తుంది. శరదృతువులోని వెన్నెల మంచు దుప్పటి కప్పినట్టు, పచ్చని చేమంతులు సిగ్గుల మొగ్గలైనట్టు హేమంతం కనువిందు చేస్తుంది. మెలికలు తిరిగే వాగువంకలు వన్నెలు చిందిస్తాయి. పచ్చని చేల పావడకట్టి, బొండుమల్లెలు కొప్పున పెట్టి వచ్చే దొరసాని లాంటి కిన్నెరసాని శోభాయమానమే కదా. చూసే మనసుండాలే గానీ అడవి అపురూప విడిది. చెట్లన్నీ ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నట్టు, కొండల్లో కో అంటే కో అనే ప్రతిధ్వనులు ప్రేమగా పలకరిస్తున్నట్టు ఉంటుంది. ఒకటేమిటి చెట్టూ చేమా గట్టూపుట్టా అన్నీ ప్రేమను పంచుతాయి, జీవిత పరమార్థాన్ని బోధిస్తాయి. ఆరు రుతువులు, పన్నెండు మాసాలూ అనునిత్యం, అణువణువూ ప్రకృతికి ప్రతీక అయిన అమ్మకు అక్షరాలా ప్రతిరూపమే.

చెట్లు దేవతా స్వరూపాలు
మహావృక్షాల్లో దేవతలు నివసిస్తారని సాంఖ్యదర్శనం, తంత్రదర్శనం తెలియ జేశాయి. మర్రి, మద్ది, రావి, వేప, శమీ, ఉసిరి మొదలైనవి తులసిమొక్కతో సమంగా పూజలందుకుంటున్నాయి. వీటిలో దైవం ఉంటుందన్నది వేదవాక్కు. రావి, ఉసిరి చెట్లలో విష్ణువు, మర్రి చెట్టులో శివుడు, మామిడిలో భూదేవి, లక్ష్మీదేవి, శమీవృక్షంలో (జమ్మి చెట్టు) శనిదేవుడు, వేపచెట్టులో ధన్వంతరి, సూర్యుడు, తులసిమొక్కలో లక్ష్మీదేవి నివాసముంటారు.

పర్వతాన్ని పూజించిన శ్రీకృష్ణుడు
ప్రకృతిలో భాగమైన కొండలను పూజించడం మన సంప్రదాయం. హిమవంతం, వింధ్య, నిషధం, మాల్యవంతం, పారియాత్రం, గంధ మాదనం, హేమకూటం.. ఈ సప్త కుల పర్వతాలతో పాటు మరెన్నో కొండలున్నాయి. వాటిపైన ఉద్యానవనాలు, ఔషధీ వృక్షాలు ఉంటాయి. లక్ష్మణుని ప్రాణ రక్షణ కోసం ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని తేవడం మనకు తెలిసిందేగా. శ్రీకృష్ణభగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడమే కాదు.. తాను పూజ చేశాడు, గోపాలురతోనూ చేయించాడు.

‘ప్రారంభః క్రియతే అనయేతి ప్రకృతిః’ అన్నారు. ప్రకృతితో జగత్తు ఆరంభమవుతుంది. ఆదిపరాశక్తి నుంచి జనించినవే ప్రకృతి, పురుషుడు. ప్రకృతి పదార్థానికి, పరిణామానికి ఆధారం. పురుషుడు ఆత్మకు, చైతన్యానికి మూలం. మాయతో కూడిన పరమ సత్యం పదార్థం. అంటే దైవిక శక్తి. ప్రాణుల్లోని ఆత్మ పురుషుని స్వరూపమైతే మనసు, బుద్ధి ప్రకృతి లక్షణాలు.
చెట్టుచేమలు, పశుపక్ష్యాదులు, కొండకోనలు, నదులు, సముద్రాలు అన్నీ ప్రకృతిలో భాగమే. ఇది సజీవ సౌందర్యం, పంచభూతాత్మకం. భగవంతుని సంకల్పం, ఆయన లీలా విలాసమే ప్రకృతి. అందులో ప్రతిదీ దైవ స్వరూపమే. ప్రకృతిలో దేవుడున్నాడు, దైవంలో ప్రకృతి ఉంది. అంటే రెండిటికీ భేదం లేదు.

ప్రకృతి పంచభూతాత్మకమైంది. మన శరీరమూ పంచభూతాత్మకమే. మనం జనించేది ప్రకృతి నుంచి. లీనమయ్యేదీ ప్రకృతిలోనే. ఈ మధ్యలో జీవితమంతా ప్రకృతితోనే ముడిపడి ఉంది. అంటే భిన్నత్వంలో ఏకత్వంలా కలగలసి ఉన్నాం. ఆ ప్రకృతి అనుగ్రహం ఉంటే అనారోగ్యం, ఆందోళన, పతనం ఉండవు. అదే మన ప్రగతికీ, ప్రాణానికీ కూడా రక్ష. ప్రకృతిని ఆరాధిస్తే సకల శుభాలూ చేకూరుతాయి. అపకారం తలపెట్టి ఆగ్రహం కలిగిస్తే మట్టుకు ప్రళయతాండవమే. మేఘాలు, నదులు, సముద్రం, చెట్లు.. ప్రకృతిలోని ప్రతిదీ లోకోపకారే. ఆహారం, ఆహ్లాదం, వసతి, వస్త్రం.. ఇలా సర్వం ప్రసాదించేది ప్రకృతే.

చనిపోయీ పలుకుతున్నాడు…
గంగ, యమున, సరస్వతి, కావేరి, గోదావరి, కృష్ణ, పినాకిని, తుంగభద్ర- ఒకటేమిటి నదులన్నీ జగన్మాత రూపాలైతే.. సముద్రం పురుష రూపం. సాగర మథనం జరిగితేనే కదా లక్ష్మీదేవి, చంద్రుడు, అప్సరసలు, హాలాహలం, అమృతం.. ఇలా సకల సంపదలూ ఉద్భవించాయి. వ్యాసమునికి శుకయోగీంద్రుడు ప్రకృతిశక్తితో జన్మించాడు, ప్రకృతిలోనే విలీనమయ్యాడు. తను లేనన్న లోటుతో తండ్రి దుఃఖించకుండా.. ఆయన పిలిచినప్పుడల్లా ప్రకృతితో తన స్వరం కలిపి పలుకుతుంటాడు శుకయోగీంద్రుడు.

తులసితీర్థంతో మోక్షం
ప్రకృతి పెట్టిన భిక్షతోనే సమస్త ప్రాణికోటీ జీవిస్తోంది. తులసిమొక్కను పూజించటం మన ఆచారం. నిత్యం పూజలందుకుని, సకల సౌభాగ్యాలనూ అందించే చల్లని తల్లి తులసిమాత. ఆయుర్వేదంలో తులసికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తులసి ఆకులు, రసం ఆరోగ్యదాయకాలు. అంతేనా! మన ఆఖరి మజిలీ అయిన మరణ సమయంలో నోట్లో తులసితీర్థం పోస్తారు. అలా చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. వేపాకులు, కాయలు, బెరడు, కొమ్మలు ఒకటేమిటి వేపచెట్టులోని అణువణువూ ఔషధప్రాయమే. అమ్మ వారు పోసినప్పుడు వేపగాలి సోకాలని రెమ్మలతో విసరడం తెలిసిందే. వేప చర్మరోగాలను నశింప చేస్తుంది. అమ్మవారు అనే వ్యాధికి వేపలో నిక్షిప్తమై ఉన్న జగన్మాతే రక్ష. అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేసి తరిస్తారు భక్తులు. ఆ గిరి ప్రదక్షిణ చేస్తేనే ఆ క్షేత్ర దర్శన ఫలం దక్కుతుంది. మేరువు, సహ్య, మైనాకం మొదలైనవన్నీ దేవగిరులే. పరమశివుని నివాసం కైలాస పర్వతం. గంగాదేవి దాని మీది నుంచే భూలోకానికి చేరింది. పర్వతాలు భూమి పైభాగాన ఉన్నట్లు కనిపించినా.. నిజానికి భూమి అడుగున ఎంతో లోతుగా వ్యాపించి ఉన్నాయి. అందుకే పర్వతాలను భూధరాలు, భూమిని పర్వతస్తని అని పిలుచుకుంటాం.

ప్రకృతి ఆరోగ్య ప్రదాయినే కాదు.. ఆ సౌందర్యం చూస్తే అప్రమేయమైన, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉల్లాసం, ఉత్సాహం, తేజస్సు సొంతమవుతాయి. ఉపకారంతో పాటు ఉపదేశాన్ని అందిస్తుంది ప్రకృతి. సర్వులకూ సదా మేలు చేయమని, ప్రతి ప్రాణినీ సమంగా చూడమని, అందరినీ ఆదరించమని బోధిస్తుంది. సజీవమైన ప్రకృతి మనకు తల్లి, తండ్రి, గురువు, దైవం. కొండాకోన, చెట్టూపుట్టా, పశువూ పక్షి… అవే మనకు అండాదండా. వాటి నుంచి నేర్చుకోవలసిందెంతో ఉంది. మనలో సాత్త్విక, రాజస, తామసిక గుణాలను ప్రకృతే కల్పిస్తోంది. సృష్టి స్థితి లయలకు ఈ గుణత్రయమే ఆధారం. ప్రకృతి మాతను పూజిద్దాం. ప్రశాంత చిత్తంతో మనుగడ సాగిద్దాం.

డా.పి.లలితవాణి