
రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానున్నాయి. జీవోలను ఉంచే జీవోఐఆర్ వెబ్‌పోర్టల్‌లో ఇకపై ప్రతి జీవోను ఆంగ్లంతోపాటు, తెలుగులోనూ అప్‌లోడ్ చేయాలని అన్ని శాఖలనూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ‘దేశంలోనే మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు. ప్రభుత్వ పాలనలో జీవోలు అత్యంత కీలకమైనవి. ప్రభుత్వ నిర్ణయాలు, సూచనలు, విధానాలు, నిబంధనలను వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారులు, ప్రజలకు చేరవేసే సాధానాలివి. ప్రభుత్వ ఉత్తర్వులను ఆంగ్లంతో పాటు తెలుగులో అందుబాటులోకి తేవడం.. వాటిలోని సమాచారం ఎక్కువమందికి చేరేందుకు, పారదర్శకతకు దోహదం చేస్తుంది’ అని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తెలుగు భాష, సాంస్కృతిక వారసత్వాలకు సముచిత గౌరవం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 
జీవోలను ఆంగ్లం, తెలుగు భాషల్లో అప్‌లోడ్ చేసేందుకు ఐటీశాఖ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దానికి మూడు రకాల ఐచ్ఛికాలను సూచించింది. మొదట ఆంగ్లంలో జీవోను అప్‌లోడ్ చేస్తే, ఒకటి రెండు రోజుల్లో అదే జీవోను తెలుగులో అందుబాటులోకి తేవాలని, మొదట తెలుగులో జీవోను పెడితే, ఒకటి రెండు రోజుల్లో ఆంగ్లంలో అప్‌లోడ్ చేయాలని సూచించింది. మూడో ఐచ్ఛికంగా రెండుభాషల్లోనూ ఒకేసారి జీవోలను అప్‌లోడ్ చేసే వెసులుబాటు ఉండాలని తెలిపింది. తెలుగులో జీవోలకు సంబంధించి సాధారణ పరిపాలనశాఖ శుక్రవారం విడుదల చేసిన జీవోను.. ఆంగ్లం, తెలుగు భాషల్లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఆ ఉత్తర్వుల అమలుకు శ్రీకారం చుట్టింది.





