ArticlesNews

కాశ్మీర్ వేర్పాటువాదులకి పాక్ నిధులు – ఎన్ ఐ ఏ వెల్లడి.

95views

మ్మూకశ్మీర్‌లోని వేర్పాటు వాదులకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి నిధులు వెళుతున్నాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. వేర్పాటు వాదులైన సయ్యద్ షా గిలానీ, షబ్బీర్ షా, యాసిన్ మాలిక్, ఆసియా ఆంద్రబి, మసరత్ అలాంలకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్, పాకిస్తాన్‌లోని ఉగ్రసంస్థలు, సరిహద్దుల నుంచి జరిగే వాణిజ్యం ద్వారా, హవాలా మార్గాల ద్వారా వీరికి నిధులు సమకూరుతున్నట్లు తమ విచారణలో తేలిందని జాతీయ విచారణా సంస్థ (ఎన్ఐఏ)లోని ఇద్దరు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదే విషయాలను ప్రస్తావిస్తూ ఈ వారాంతంలో చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇందులో వేర్పాటు వాదులైన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, ఆంద్రబీ, ఆలం మరియు జహూర్ అహ్మద్ వతాలి పేర్లను చేర్చనున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదంకు నిధులు సమకూరుస్తున్న కేసులో ఇది మూడవ చార్జ్‌షీట్ అవుతుంది. గతేడాది రెండు చార్జ్ షీట్లను దాఖలు చేయడం జరిగింది. వేర్పాటు వాదులపై ఉచ్చు బిగించేందుకు ఎన్‌ఐఏ వారి ఈమెయిల్స్, వీడియోలు, టీవీ ఇంటర్వ్యూలు, బహిరంగ ప్రసంగాలపై నిఘా ఉంచింది. అందులో లభించిన అంశాలే ఆధారాలుగా చూపించనుంది.

ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా వేర్పాటు వాది అయిన యాసిన్ మాలిక్ నోరు జారారు. కొన్నేళ్ల క్రితం తాను ముర్రీలోని లష్కరే తొయిబా క్యాంప్‌కు వెళ్లినట్లు చెప్పాడు. అక్కడ ఎల్‌ఈటీ క్యాడర్‌ను ఉద్దేశించి ప్రసంగించినట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడే ఎన్ఐఏ యాసిన్ మాలిక్‌ను పట్టుకుంది. సామాన్య ప్రజలను రెచ్చగొట్టి అక్కడ హింస చెలరేగేలా ఆల్‌పార్టీ హురియత్ కాన్ఫిరెన్స్ ముఖ్య ఉద్దేశం అని ఎన్ఐఏ పేర్కొంది. వేర్పాటువాదులంతా చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారని పాకిస్తాన్ ఆదేశాలపై నడుచుకుంటున్నారని ఎన్ఐఏ పేర్కొంది. వీరి క్యాడర్ గ్రామాల్లో, జిల్లాస్థాయిలో ఉందని వెల్లడించింది . వీరంతా మిలిటెంట్ల స్థావరాలకు వెళతారని, వారి అంత్యక్రియల్లో పాల్గొంటారని, విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసి యువతను ఉగ్రవాదం వైపు నడుపుతున్నారని ఎన్ఐఏ వెల్లడించింది.
పనికిరాని అంశాలపై నిరసనలు తెలియజేయాలని వేర్పాటు వాదులు స్థానిక యువతను రెచ్చగొట్టి ఆ తర్వాత రాళ్లదాడికి పాల్పడేలా ఉసిగొల్పుతారని ఎన్ఐఏ చెబుతోంది. దీంతో సాధారణ జీవనం దెబ్బ తినేలా వేర్పాటు వాదులు ప్లాన్ చేస్తారని ఎన్ఐఏ చెబుతోంది. ఇక పాకిస్తాన్ హైకమిషన్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసే పలు ఫంక్షన్లకు హాజరై అక్కడ వారిచ్చే సూచనల ప్రకారం ఈ వేర్పాటు వాదులు నడుచుకుంటారని ఎన్‌ఐఏ వెల్లడించింది. అంతేకాదు మృతి చెందిన మిలిటెంట్ల కుటుంబాలను ఆదుకునేందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నిధులు తీసుకుంటారని ఎన్ఐఏ వెల్లడించింది. అంతేకాదు కశ్మీరీ యువత పాకిస్తాన్ యూనివర్శిటీలో చదువుకోవాలని భావిస్తోందని చెప్పి ఇక్కడ కూడా డబ్బులు దండుకుంటున్నారని ఎన్‌ఐఏ పేర్కొంది.

ఇక సరిహద్దు రేఖ వద్ద జరిగే వాణిజ్యం ద్వారా వచ్చే డబ్బులను హవాలా మార్గం ద్వారా తరలించి వేర్పాటువాదులకు చేరుతున్నాయని ఎన్ఐఏ వెల్లడించింది. ఇందుకోసం కశ్మీరీ హ్యాండ్‌లూమ్స్‌ బిజినెస్‌ను అస్త్రంగా చేసుకుని నిధులు తమకు వెళ్లేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

Source : One India

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.