ArticlesNews

హిందూధర్మ పరిరక్షణ సాధనలో మహా పురుషులు ఎందరో…!!

251views

ప్రాచీన కాలం నుండి భారతదేశం లోక కల్యాణానికి పాటు పడుతూనే వచ్చినది. ఆ కార్యాన్ని సాధించుటకు పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని కోరుతూ, త్యాగమయ జీవితాన్ని గడుపుతూ వచ్చినది. భగవద్భక్తి, త్యాగనిరతి హిందూజాతి స్వభావమని చెప్పవచ్చు. వీటిని నాశనం చేయడానికి స్వార్థపరులైన దుష్టశక్తులెన్నో ఈ దేశంపైన దండయాత్ర సాగించి నవి. వాటిని ఎదుర్కొనుటకు హిందూజాతి సాత్విక శక్తిని కూడా సంపాదించినది. ఆ శక్తిముందర దుష్ట శక్తుల ఆట సాగలేదు. అవి మోకరిల్లినవి. హిందూ జాతి తన సాధనలో నిమగ్నమై ఉంటూ ప్రపంచం. చేసిన అపచారాలను క్షమిస్తూ ముందుకు సాగింది.

ఈ దివ్యసాధనలో అనేకమంది మహాపురుషులు అవతరించారు. వారిలో భగవాన్ బుద్ధుడు ఒకరు. బుద్ధుడు జాతిని అహింసామార్గంలో నడిపించే ఉద్దేశ్యంతో తాను సన్యాసదీక్ష స్వీకరించి “అహింసా పరమోధర్మః” అనే మంత్రాన్ని బోధిస్తూ స్వదేశంలోని రాజవంశీయులందరికీ సన్యాస దీక్ష ఇచ్చి వారిని తన అనుయాయులుగా మార్చినారు. విదేశాలకు కూడ బౌద్ధ భిక్షువులను పంపించి బౌద్ధమతప్రచారం ప్రారంభించారు. అహింసా మతప్రచారకులు ప్రపంచ మంతటా వ్యాపించారు. వారు ప్రపంచ ప్రజలకు స్నేహాన్ని, ప్రేమను, త్యాగాన్ని బోధించారు. కాని దుష్టశక్తులు దీనిని దురుపయోగం చేసుకోవ డానికి ప్రారంభించి హిందూ దేశంపై దండయాత్రలు సాగించినవి. ఈ దేశంలోని రాజులు బుద్ధుని ప్రభావంచేత శత్రువులను విసర్జించినందు వల్లనే…“నకాంక్షే విజయం కృష్ణా నచరాజ్యం సుఖానిచ కింనో రాజ్యేన గోవింద కింభోగైర్జునితేనవ” అంటూ చేతులు కట్టుకొని మానవులందరూ ఒకటేనంటూ, వారిని సంహరిస్తే పాపం వస్తుందంటూ నీతిని బోధించడం ప్రారంభించారు. ఇది మోహవశాత్తు వారిలో కలిగిన అజ్ఞానమే తప్పమరేమీ కాదు. లోకానికి మంచి విషయాన్ని బోధించిన హిందు వులపై ప్రపంచ ప్రజలు దురాక్రమణలు ఎందుకు చేసారు? ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు ఒక చిన్న కథ ద్వారా సమాధానం చెప్పవచ్చు.

ఒక అడవిలో విశాలమైన పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపైన అనేక పక్షులతోపాటు కొన్ని కోతులు కూడా నివసిస్తూ ఉండినవి. పక్షులు చక్కగా గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటే కోతులు వానలో తడుస్తూ, చలిలో వణకుతూ ఎండలో మాడిపోతూ జీవిస్తూ ఉన్నాయి. ఈ దుస్థితిని చూసి జాలి కలిగిన పక్షులు కోతులకు, కూడా మీరూ చక్కగా గూడుకట్టుకొని లక్షణంగా, భద్రమైన జీవితాన్ని గడపవచ్చునని బోధించినవి. నీతి చెప్పిన పక్షుల పైన దుష్టస్వభావం గల కోతులు దాడిచేసి, పక్షులను నానా హింసల పాలు చేసినాయి. ఎలాంటి తప్పు చేయని పక్షులను కోతులు ఎలా పీడించినవో అలాగే దుష్టశక్తులు హిందూ జాతిపైన దురాక్రమణ సాగించి, నానా హింసలు పెట్టి శాంతి మార్గాన్ని అనుసరిస్తూ అహింసా పరమోధర్మ: అనే మంత్రాన్ని పఠిస్తున్న వారిని జయించి తమ రాజ్యా లను స్థాపించుకొన్నారు. ఈ దురాక్రమణ కారులు బౌద్ధమత ముసుగులో బౌద్ధ సన్యాసులను మోసం చేస్తూ, హిందు దేశవాసులపైన దాడి జరుపుతూ వారిలో మతమౌఢ్యాన్ని పెంచి ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ తమ రాజ్య విస్తరణను కొనసాగించారు. మతోన్మాదులైన బౌద్ధులు శత్రు విచక్షణా బుద్ధి రహితులై స్వదేశ బాంధవులకన్నా బౌద్ధులుగా వచ్చిన శత్రువులను మిత్రులుగా భావించారు.

ఈ పరిస్థితిలో “క్లైభ్యం మాస్మ గమపార్టీ” అంటూ బోధించి జాతిలోని జాడ్యాన్ని తొలగించి, మందలించి నిలబెట్ట వలసిన అవసరం ఉండినది. దేశంలో హిందూత్వాన్ని రక్షించుకొనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.

శ్రీ గౌడ పాదాచార్యులు, శ్రీ గోవింద భగవత్పాదులు, శ్రీ కుమారిభట్టులు, శ్రీ మండన మిత్రులు మొదలగువారు ఒక విధమైన ప్రయత్నం సాగిస్తూ ఉంటే, శైవులు – శాక్తులు- జైనులు తదితర విభిన్న మతాలవారు వారి వారి వద్దతిలో బౌద్ధులనెదుర్కొనే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చినారు. వీరందరూ విడివిడిగా సమర్థులే. కానీ ఎవరికీవారే యమునాతీరే అన్నట్లు మరో న్మాదులుగా, ఛాందసులుగా, నేను పట్టిన కుందేటికి మూడేకాళ్ల అన్నట్లు ఎవరివాదాన్ని వారు సమర్థించుకొంటూ ఉండినారు.