News

సాంకేతికతల మేళవింపు.. పాంబన్‌ సేతు

214views

నిలువునా పైకి లేచే దేశపు తొలి వర్టికల్‌ బ్రిడ్జి.. పాంబన్‌ సేతు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానించే ఈ రైల్వే వారధి ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి దక్షిణ రైల్వే తరఫున తెలుగు వారైన నడుపూరు వెంకట చక్రధర్‌ సీనియర్‌ ఇంజినీర్‌ హోదాలో ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

అలా ఒడ్డును వీడి.. పట్టాలపై చేరింది!
పాంబన్‌ వంతెనలో ప్రధానమైన వర్టికల్‌ లిఫ్ట్‌ స్పాన్‌ నిర్మాణానికి నేను పర్యవేక్షకుడిగా పనిచేశాను. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2020లో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది. నిర్మాణంలో ఎక్కడా 1 మి.మీ. తేడా రాకుండా నిపుణులు జాగ్రత్త పడ్డారు. రోజూ వందల మంది రేయింబవళ్లూ గాలి, వానను లెక్కచేయకుండా పనిచేశారు. వర్టికల్‌ లిఫ్ట్‌ స్పాన్‌ను తీరం నుంచి 600 మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు 5 నెలలు పట్టింది. 660 టన్నులు, 72.5 మీటర్ల పొడవున్న ఈ లిఫ్ట్‌ను పట్టాలపై తప్ప, మరో మార్గంలో తరలించలేం. పైగా సముద్రంలో ఈ వంతెన వంపుగా ఉంటుంది. లాంఛింగ్‌ గర్డర్లు, బేరింగుల సాయంతో పట్టాలపైకి ఎక్కించి, రోజూ కొంతదూరం కదిలించేవారు.

వంతెనలో వింతలెన్నో!
సముద్రంలో 2.08 కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్‌ లిఫ్ట్‌ ఉంటుంది. దీనికి రెండు వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి 310-320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి. రెండు దూలాల బరువు 625 టన్నులు. మొత్తం లిఫ్ట్‌లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్‌ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్‌ వెయిట్‌లు నియంత్రిస్తాయి. బ్రిడ్జి ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్‌లు, మోటార్ల సాయంతో అవలీలగా పైకొస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్‌ ద్వారా నడుస్తుంది. ఇక, 2.08 కి.మీ. వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో ఉన్నాయి. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా 3 గుండ్రటి పైల్స్‌ నిర్మించారు. ఇవి పటిష్ఠంగా ఉండేలా, సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకూ 25-35 మీటర్ల లోతున పునాదులు తీశారు. కొన్నిచోట్ల భారీ రాళ్లు రాగా, వాటిలోనే కాంక్రీట్ చొప్పించారు.

తుప్పుపట్టకుండా జాగ్రత్తలు
ప్రపంచంలోనే రెండో అతి ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతంగా పాంబన్‌ తీరానికి పేరుంది. కెరటాలు వంతెనపైకీ వస్తుంటాయి. పాత వంతెన ఇనుము తుప్పుపట్టి, మందం కరిగిపోయింది. కొత్త వంతెనకు ఆ సమస్య రాకుండా నిర్మాణాలపై 3 పొరలుగా పాలీసిలోక్సేన్‌ పెయింటింగ్‌ పూత వేశారు. 58 ఏళ్ల వరకు ఢోకాలేదు. చిన్నచిన్న మరమ్మతులతో వందేళ్ల వరకూ ఇబ్బందిలేదు. సముద్రంలోని దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్‌ విధానంలో ఐరన్‌ చట్రాలతో కాంక్రీట్ వేశారు. ట్రాక్‌ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో పాటు ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్‌ (ఎఫ్‌ఆర్‌పీ) వాడారు. వర్టికల్‌ లిఫ్ట్‌ వంతెనకు ఒక్క బోల్టూ వాడలేదు. వెల్డింగ్‌తోనే తయారుచేశారు.

సెన్సర్లతో పరిశీలన
వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో అనుసంధానించారు. గంటకు 58 కి.మీ. వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపై యంత్రాలున్నాయి. దిమ్మెల్లోని గదుల్లో దేశ, విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు, చట్రాలున్నాయి. మత్స్యకారుల పడవలు, బార్జ్‌ పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెల పైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్‌ చేస్తారు. ఇందులో వర్టికల్‌ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్‌ నుంచి తీసుకున్నాం. మిగిలినవన్నీ భారత్‌లో తయారైనవే.