News

క్రిస్మస్ రోజు ధ్వని కాలుష్యం చేశారంటూ అయ్యప్ప స్వాములపై కేసులు

351views

అయ్యప్ప స్వాములపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.క్రిస్మస్ రోజున అయ్యప్ప పాటల కారణంగా శబ్ద కాలుష్యమైందంటూ పోలీసులు కేసు నమోదు చేయడం విస్తు గొలిపేలా చేస్తోంది.ఈ నెల 25 న మేడ్చల్ జిల్లాలోని ముత్యాలమ్మ గుడి దగ్గ అయ్యప్ప స్వాముల పడిపూజ నడుస్తోంది. అదే సమయంలో సమీపంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే పోలీసులు అయ్యప్ప స్వాముల దగ్గరికి వచ్చి, జోక్యం చేసుకొంటూ.. శబ్ద కాలుష్యం జరుగుతోందంటూ చర్చి ఫిర్యాదు చేసిందంటూ పేర్కొన్నారు. క్రిస్మస్ రోజు పూజలు, భజనలు చేయడకూడదని మేడ్చల్ పోలీసులు వాగ్వాదానికి దిగారు.

ఈ సమయంలో పోలీసులు అయ్యప్ప స్వాముల మనోభావాలను పూర్తిగా తుంగలో తొక్కారు. ఏకంగా పాద రక్షలతోనే అయ్యప్ప పూజ మండపంలోకి ప్రవేశించారు. వెంటనే అయ్యప్ప గీతాలను ఆపేయాలంటూ హుకూం జారీ చేశారు. దీంతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప ఆచారాలను ఏమాత్రం గౌరవించడం లేదని మండిపడ్డారు. పోలీసుల చర్యలను ఖండించారు. హిందూ సంప్రదాయాలను ఏమాత్రం గౌరవించడం లేదని విమర్శించారు. నిబంధనలను అతిక్రమించి పోలీసులు వ్యవహరించారని, అయ్యప్ప దీక్ష పవిత్రతను ఏమాత్రం గౌరవించడం లేదని స్వాములు అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసు అధికారి ప్రవర్తనను అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అయ్యప్ప సంప్రదాయాన్ని తన అహంకార ప్రవర్తనతో అగౌరవపరిచారని మండిపడుతున్నారు.

మరోవైపు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు అయ్యప్ప భక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పరిస్థితి మరింత ముదిరిపోయింది. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 132 కింద కేసు నమోదైంది. ఇలా కేసులు పెట్టడం ద్వారా అయ్యప్ప స్వాములను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు పోలీసులు అత్యుత్సాహం, పక్షపాత వైఖరి, అయ్యప్ప స్వాములను అవమానించిన తీరును నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ భారీ ఆందోళన నిర్వహించింది. అయ్యప్ప భక్తులకు న్యాయం చేయాలని, అలాగే మేడ్చల్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నాకి దిగారు. హిందూ సంప్రదాయాల పట్ల, మతపరమైన కట్టుబాట్ల విషయంలో పోలీసులు సున్నితత్వం ప్రదర్శించాలని, కానీ… పక్షపాత ధోరణితో వ్యవహరించాలని నాయకులు మండిపడ్డారు. అంతేకాకుండా ఏకంగా కేసులు కూడా నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహంతో వున్నారు.
మేడ్చల్ పోలీసు అధికారుల ప్రవర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తుడు రవీందర్ మేడ్చల్ ఏసీపీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయ్యప్ప స్వాముల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ మాట్లాడుతూ… హిందుయేతర పండల విషయంలో వచ్చే శబ్ద కాలుష్యంపై మౌనంగా వుంటున్నారని మండిపడ్డారు. హిందూ పండగల విషయంలో మాత్రం పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మోసపూరితమని, పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పూజా ప్రాంగణంలోకి పోలీసులు ఏకంగా బూట్లతోనే వచ్చారని, పవిత్రతను అగౌరవపరిచారన్నారు.