
సమైక్య, శక్తిమంతమైన, సుసంపన్నమైన, ఆత్మగౌరవం కలిగిన భారత దేశం కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు రామ్ మాధవ్ పేర్కొన్నారు. భారత్ కచ్చితంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందిందని, ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. గోవా కేంద్రంగా ‘‘పాంచజన్య’’ పత్రిక ఆధ్వర్యంలో ‘‘సాగర్ మంథన్’’ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఈ విదేశాంగ విధానం విషయంలో స్వయంప్రతిపత్తిని చాటిందని అన్నారు.
తాము ఎవ్వరి వెనుకా లేమన్న స్పష్టమైన సంకేతాలను భారత్ ఈ పది సంవత్సరాలలో పంపిందని, అంటే భారత్ ప్రయోజనాల కోసం ఏ దేశంతోనైనా సంబంధాలను కొనసాగిస్తామన్న విషయాన్ని తేల్చి చెప్పిందన్నారు. అటు అమెరికాతో ఇటు రష్యాతో కూడా భారత్ సంబంధాలను కొనసాగిస్తోందని, రష్యాతో స్నేహం విషయంలో అమెరికా ఏమనుకున్నా పట్టించుకోమన్నారు. దీనినే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అని అంటారని తెలియజేశారు. మన దేశాన్ని మనమే శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దుకోవచ్చని స్పష్టం చేశారు.
2010-2013 మధ్య కాలంలో చైనా మన సరిహద్దులను 600 సార్లు ఉల్లంఘించిందని అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్వయంగా పార్లమెంటులో ప్రకటించారని రామ్ మాధవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని, చేసిన తప్పును ఎత్తి చూపుతున్నామని అన్నారు.
బంగ్లాదేశ్ అకృత్యాలపై
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై రామ్ మాధవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే అక్కడి ప్రజలు, అక్కడి ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి వుందని, బంగ్లాదేశ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తలెత్తిన సమయంలో ముక్తి వాహినీ సంస్థ ఉద్యమం ప్రారంభించిందని, అప్పుడు ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి పశ్చిమ పాక్ నాయకత్వం ప్రయత్నించిందని, సైన్యాన్ని కూడా ఢాకాకి పంపిందన్నారు. 1971 మార్చిలో మొదటిసారిగా సైన్యం స్వాతంత్రం కోరుతూ ప్రజలను హింసించిందన్నారు. పాక్ సైన్యం దాిలో 5,000 మంది మరణించారన్నారు. వారందరూ హిందువులేనని, బంగ్లాదేశ్ ఆవిర్భావం కోసం మొదటి నుంచి ప్రాణాలను త్యాగం చేసింది హిందువులేనన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని అన్నారు.
పాక్ సైన్యం అణచివేత కొనసాగిన సమయంలో కోటి మంది హిందువులు భారత్ కి వచ్చేశారని, 1972 లో బంగ్లాదేశ్ ఏర్పడి, షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రధాని అయ్యారని, ముజిబిర్ రెహ్మాన్, అప్పటి ప్రధాని ఇందిర మధ్య హిందువులను రక్షిస్తామన్న ఒప్పందం కుదిరిందని, లిఖితపూర్వకంగా రెహ్మాన్ హామీ ఇచ్చారని రామ్ మాధవ్ గుర్తు చేశారు. దీని తర్వాత కోటి మంది హిందువులు తిరిగి బంగ్లాదేశ్ కి వెళ్లిపోయారన్నారు. కానీ దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ లో హిందువులపై అఘాయిత్యాలు ఎప్పుడూ జరుగుతూనే వున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడూ అదే జరుగుతోందన్నారు. అక్కడ ప్రస్తుతం అస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, అందుకే ఛాందసులు హిందువులపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.
భారత్ విశ్వగురు స్థానంపై…
విశ్వగురు స్థానానికి చేరుకునే సత్తా భారత్ కి వుందని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో యోగి అరవిందులు ఆగస్ట్ 15, 1947 లో తిరుచిరాపల్లి రేడియో స్టేషన్ లో మాట్లాడారని గుర్తు చేశారు. భారత్ కి స్వాతంత్రం వచ్చిందని కానీ.. తన కోసం కాదన్నారన్నారు. యావత్ ప్రపంచానికి వెలుగులు పంచడానికి అని అన్నారన్నారు. ఇందుకోసం ఆ సామర్థ్యాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఆ సామర్థ్యం సిద్ధించే వరకూ ప్రపంచానికి స్నేహితుడిగా భారత్ వుంటుందన్నారు.
విశ్వగురు స్థానాన్ని భారత్ సాధించాలని ప్రధానితో సహా అందరూ అంటుంటారని, దీని కోసం మొదట భారత్ వికసిత భారత్ కావాలని, అప్పుడు ప్రపంచమే మీరు విశ్వగురు భారత్ అని చెబుతుందన్నారు. అంటే మొదట అఖండ భారతాన్ని సృష్టించాలని, దీని తర్వాత సమాన హక్కులు లభించాయని అందరూ భావించే స్థితి రావాలన్నారు. దీని తర్వాత భారత్ ను శక్తిశాలిగా తీర్చిదిద్దాలని, సుసంపన్న భారతావణిని సృష్టించాలన్నారు. దీని తర్వాత ఆత్మ గౌరవ భారత్ నిర్మాణం కావాలన్నారు. ఈ నాలుగు విషయాల తర్వాతమాత్రమే భారత్ విశ్వగురువు అవుతుందని రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు.





