
హిందువులంతా ఏకం అయ్యే సమయం ఆసన్నమైందని, హైందవ శంఖారావం ద్వారా హిందువుల ఐక్యతను చాటాలని విజయవాడ భువనేశ్వరి పీఠం స్వామీజీ కమలానంద భారతిస్వామి పిలుపునిచ్చారు. విజయవాడలో జనవరి 5న జరగనున్న హైందవ శంఖారావం మహాసభకు సన్నద్ధమయ్యే అంశంపై కోనసీమ జిల్లా అమలాపురంలోని స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో సమావేశంలో స్వామీజీ మాట్లాడారు. హైందవ శంఖారావం స్ఫూర్తితో దేవాలయ వ్యవస్థను గాడిన పెట్టాలని స్వామీజీ సూచించారు. ఈ వ్యసస్థ గాడిన పడాలంటే హిందువులంతా దేవాలయాలను నిర్వహించుకునే సన్నద్దత పెంచుకోవాలన్నారు. దేవాలయాలను ప్రభుత్వం గుప్పిట్లోంచి విడిపించుకోవాలని తెలిపారు. హైందవ శంఖారావం మహాసభకు ప్రతీ హిందువు విధిగా తరలివచ్చేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో దేవాలయాలను ప్రైవేటుగా నిర్వహిస్తూ ఒక్క రూపాయి టిక్కెట్ లేకుండా నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ చాలక్ డాక్టర్ గోదశి గంగరాజు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం, బజరంగ్ దళ్ రాష్ట్ర సహాయ ప్రముఖ్ శిరంగు నాయుడు, పంచాంగ కర్త ఉపద్రష్ట నాగాదిత్య, కర్రా సంతోష శాస్త్రి పాల్గొన్నారు.





