
హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని జీవోలో స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకూ…
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఏపీ సర్కారు పేర్కొంది. దీంతో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ప్రస్తుతం హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను వేరే శాఖల్లోకి మార్చాలని ప్రభుత్వం ఆ జీవోలు ఆదేశాలిచ్చింది.
కఠిన చర్యలు తప్పవు…
ఒక వేళ అన్యమతంలో కొనసాగుతూ హిందూ దేవాలయాల్లో విధులు నిర్వహిస్తుంటే విజిలెన్స్ శాఖకు సమాచారం అందించాలని జీవోలో స్పష్టం చేసింది. సదరు ఉద్యోగుల ఇళ్లల్లో జరిగే పండగలు, పెళ్లిళ్లు, ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్ శాఖకు అందజేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

గతంలోనే…
గతంలో కూడా అన్యమతస్తులను హిందూ దేవలయాల్లో నియమించారని, వారందరినీ తొలగించాలని హిందూ సంఘాలు ఇటీవల డిమాండ్ చేశాయి. హిందూ దేవాలయాల్లో అన్యమతస్తుల నియామకంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
విమర్శలు వెల్లువెత్తుతుండడంతో…
శ్రీశైలంతోపాటు ఇతర ప్రముఖ దేవాలయాల్లోనూ ఇతర మతస్తులను ఉద్యోగాల్లో నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ ఆలయాల్లో హిందువులను మాత్రమే ఉద్యోగాల్లో నియమించాలనే డిమాండ్లు పెరిగాయి. హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
Source : One India
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





