News

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు పాకిస్థాన్ ఆహ్వానం

639views

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అనూహ్యమైన పిలుపు అందింది. ఆ పిలుపు ఇచ్చింది మన పొరుగు దేశం పాకిస్థాన్. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత మనదేశం పట్ల అక్కసు వెళ్ళగక్కుతూ వస్తున్న పాకిస్థాన్ ఈ అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. రెండు దేశాల మధ్య వారధిలా భావిస్తోన్న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి తాము మన్మోహన్ సింగ్ ను ఆహ్వానిస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ వెల్లడించారు. త్వరలోనే ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేస్తామని తెలిపారు.

కర్తార్ పూర్ సిక్కుల ప్రథమ మత గురువు, ఏకేశ్వరోపాసనను బోధించిన గురునానక్ చాలాకాలం పాటు జీవించిన ప్రదేశం అది. సిక్కుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల దీనికి రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గానీ, యుద్ధ వాతావరణం గానీ సోకలేదు. భారత్ కు చెందిన సిక్కులు విదేశాంగ పరమైనటువంటి ఎలాాంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా కర్తార్ పూర్ ను సందర్శించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు కర్తార్ పూర్ కారిడార్. గురునానక్ జయంతి నాటికి పూర్తి కానుంది. ఈ కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు ఖురేషీ తెలిపారు.

భారత మాజీ ప్రధానిగా, సిక్కుల ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ తాము త్వరలోనే ఆహ్వాన పత్రికను అందజేస్తామని తెలిపారు. మన్మోహన్ సింగ్ ను మాత్రమే ఆహ్వానించడానికి సిద్ధపడుతుండటం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ, విదేశాంగ శాఖ మంత్రి లేదా ఇతర మంత్రుల పేర్లను ఖురేషీ వెల్లడించలేదు.

Source : One India
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.