
మన పొరుగునే ఉన్న మలేసియా భారత్ పై తీవ్ర ఆరోపణ చేసింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని మనదేశంపై విషం చిమ్మింది. జమ్మూ కాశ్మీర్ అత్యంత జఠిల సమస్యగా మారడానికి భారత వైఖరే కారణమంటూ ఆ దేశ ప్రధానమంత్రి మహథిర్ మహమ్మద్ సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితిలో కీలక ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ అక్రమంగా ఆక్రమించిందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్ ఒక అడుగు ముందుకేయాలని, పాకిస్థాన్ ను చర్చలకు ఆహ్వానించాలని కూడా సూచించారు.

భగ్గుమంటున్న నెటిజనం :
మలేషియా ప్రధాని మహథిర్ మహమ్మద్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ప్రజలు భగ్గుమన్నారు. మరో శతృదేశం తయారైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలేసియాను వెలి వేయాలంటూ నినదిస్తున్నారు. బాయ్ కాట్ మలేసియా అంటూ విరుచుకు పడుతున్నారు. బాయ్ కాట్ మలేసియా అనే పదాలకు హ్యాష్ ట్యాగ్ జోడించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇన్నాళ్లూ భారత్ సహాయ, సహకారాలను తీసుకుని ఆ దేశం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు పాకిస్తాన్ కు అనుకూలంగా ప్రవర్తిస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఇకపై మనదేశానికి చెందిన పర్యాటకులెవరూ మలేసియాకు వెళ్లకూడదని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయమే మలేషియా అతి పెద్ద ఆదాయ వనరని, మన డబ్బులతో మలేసియా వంటి దేశాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదంటూ తమ ట్వీట్ల ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.





