
మాతృభాష పరిరక్షణ, భాషాభివృద్ధి, తెలుగు రచనా సంపద, సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా నిర్వహించే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబరు 28, 29 తేదీల్లో జరగబోతున్నాయి. విజయవాడ కేంద్రంగా భాషా పరిరక్షణ కోసం ఇప్పటివరకూ ఐదు మహాసభలను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ ఏడాది 6వ మహాసభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దేశవిదేశాల నుంచి రచయితలు, కవులు, భాషాభిమానుల రాక ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కె.బి.యన్.కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశవిదేశాల నుంచి 1300 మందికి పైగా రచయితలు, కవులు, సాహితీవేత్తలు, మాతృ భాషాభిమానులు పాల్గొనేందుకు నమోదు చేయించుకున్నారు. ఈ ఏడాది 300 మందికి పైగా విద్యార్థులు సైతం దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే వేడుకల్లో 800 మందికి వివిధ వేదికలపై పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ఒక్కోసారి ఒక్కో నినాదంతో నిర్వహిస్తుంటారు. విజయవాడలోని కె.బి.ఎన్.కళాశాల వేదికగా ఈ ఏడాది నిర్వహించే ఆరో మహాసభల్లో ‘రేపటి తరం కోసం.. ఇప్పటి మనం ఏ మార్పు కోరుతున్నాం?’ అనే అంశం కేంద్రంగానే అన్ని సదస్సులు జరగబోతున్నాయి. భాష, సాహిత్యం సహా అన్ని రంగాల్లోనూ ఏం మార్పు తేవాల్సిన అవసరం ఉందనే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.ఆరో మహాసభలు జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు.
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి..
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 300 మందికి పైగా తెలుగు విద్యార్థులు మహాసభల్లో పాల్గొంటున్నారు. వీరికి మాతృభాషలోని పది అంశాలపై రెండు రోజులు శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. కవిత్వం, కథ, నవల, పద్యం, వ్యాసరచన, జర్నలిజం, పరిశోధన, భాష, సాహిత్యం, చరిత్ర.. అంశాలలో శిక్షణ ఇస్తారు. ఈసారి కొత్తగా యువ కవులతోనూ కార్యక్రమాలను రూపొందించారు. 170 మంది యువ కవులతో ప్రత్యేకంగా.. ‘యువ గళ సమ్మేళనం’ నిర్వహిస్తున్నారు. పర్యావరణమే ప్రధాన అంశంగా ఉండబోతోంది. వీరికి ‘పర్యావరణ కవి’ పురస్కారాలను కూడా ఇవ్వనున్నారు.
తెలుగు భాషాభివృద్ధికి వేదికగా..
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చి తమ భాషాభిమానాన్ని చాటుతుంటారు. 2007లో తొలిసారి.. తెలుగు భాషోద్యమ నిర్మాణానికి వేదికగా సభలు నిర్వహించారు. 2011లో రెండో మహాసభలను.. సాంకేతికంగా తెలుగు భాషాభివృద్ధి అనే అంశంపై నిర్వహించారు. 2015లో మూడో మహాసభలు యువతలో సృజనాత్మకత పెంచే లక్ష్యంతో సాగాయి. 2019లో నాలుగో మహాసభలు.. ప్రజల సహకారంతో తెలుగు భాషా పరిరక్షణ ధ్యేయంగా జరిగాయి. 2022లో ఐదో మహాసభలు.. స్వభాషను పరిరక్షించుకుందాం.. స్వాభిమానాన్ని పెంచుకుందాం.. నినాదంతో సాగాయి. తాజాగా ఈ ఏడాది మార్పు నినాదంతో జరగబోతున్నాయని మహాసభల ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణచందు తెలిపారు.





