News

మహా కుంభమేళాకు విశాఖ నుంచి 9 ప్రత్యేక రైళ్లు

243views

మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా విశాఖ పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపాలని తూర్పుకోస్తా రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం – గోరఖ్‌పూర్‌, విశాఖపట్నం- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. యాత్రికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డివిజనల్‌ కమర్షిల్‌ మేనేజేర్‌ కె సందీప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

విశాఖ- గోరఖ్‌పూర్‌ (3)
విశాఖ- గోరఖ్‌పూర్‌ మధ్య జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో 08562 నంబర్‌తో ప్రత్యేక రైలును ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే నడపనుంది. ఆదివారం రాత్రి 22.20 గంటలకు బయల్దేరి మంగళవారం రాత్రి 20.25 గంటలకు ఈ రైలు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. మొత్తం మూడు ట్రిప్పుల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08561) జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో బుధవారాల్లో మధ్యాహ్నం 14.20 గంటలకు బయల్దేరి శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ- గోరఖ్‌పూర్‌ మధ్య విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపుర, ఛత్రపూర్‌, బలుగావ్‌, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్‌ తదితర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలులో 3ఏసీ కోచ్‌లు-4, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లు -2, స్లీపర్‌ క్లాస్‌ – 8, జనరల్‌ సెకండ్‌క్లాస్‌ సిట్టింగ్‌ కోచ్‌లు -4, సెకండ్‌క్లాస్‌ కమ్‌ లగేజీ/ దివ్యాంగుల కోచ్‌ -1 ఉంటాయి.

విశాఖ- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ (6)
విశాఖపట్నం- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య స్పెషల్‌ (08530) ట్రైన్‌ మొత్తం ఆరు ట్రిప్పులు తిరగనుంది. విశాఖపట్నం నుంచి గురువారం సాయంత్రం 17.35 గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 4.30 గంటలకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో 08529 నంబర్‌పై దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్‌ నుంచి బయల్దేరి శనివారం బయల్దేరి సోమవారం ఉదయం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. సింహాచలం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ తదితర స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 3ఏసీ కోచ్‌లు – 4, 3ఏసీ ఎకానమీ కోచ్‌లు – 2, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు – 8, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కోచ్‌లు -4, సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజీ / దివ్యాంగుల కోచ్‌-1 ఉంటుంది.