
శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు కోలాహలంగా జరిపి రాష్ట్ర స్థాయి పండుగలా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అరసవిల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు జరుపుకోవడానికి ఉత్తర్వులు జారీ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంజిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పి కె వి మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి సమీక్షించారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ముందుగా రథసప్తమి వేడుకలకు సంబందించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రథసప్తమికి రెండు రోజుల ముందునుండే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయానికి రంగులు వేయాలన్నారు. డిసిఎంఎస్ కార్యాలయం నుండి మూడు లైన్లలో దర్శనానికి ఏర్పాటు చేయాలని, ప్రతీ పాస్ పై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు. డోనర్లు, ఐదువందల టికెట్, ఉచిత దర్శనం వారికి డిసిఎమ్ఎస్ నుండి, విఐపిలకు ఆలయ ముఖద్వారం నుండి ప్రవేశం కల్పించాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు సిద్దం చేయాలన్నారు. పారిశుధ్యం, వాహనాల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలన్నారు. పార్కింగ్ ముందుగా మూడు ప్రాంతాలు గుర్తించాలన్నారు. కేశ ఖండనశాల ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. గుగూల్ మ్యాప్ లో అరసవిల్లి పరిసర ప్రాంతాలు పరిశీలించారు. పట్టణంలో ముఖ్యమైన కూడలల్లో పూర్తి స్థాయిలో దీపాలంకరణ చేయాలన్నారు. వేడుకలు ప్రశాంతంగా సజావుగా జరగాలని అధికారులకు సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ వేడుకలు విజయవంతంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.





