
వందేళ్ల పూర్వ వైభవం కలిగిన సీతారామస్వామి ఆలయం ధూప దీప నైవేద్యాలు కరువై మూతబడింది.బాపట్ల జిల్లా చినగంజాం గ్రామ నడిబొడ్డున నెలకొని ఉన్న పురాతన ఆలయం సీతారామస్వామి ఆలయం. ఇప్పటివరకు మూతవేసిన పూర్వీకులు భక్తి విశ్వాసాలకు ఒక నిలువెత్తు ఆనవాలుగా మాత్రమే నిలిచిపోయింది. దశాబ్దాలుగా పట్టించుకునే వారు లేకపోవడంతో పూర్తిగా ఆలయం రూపురేఖలు మారిపోయాయి. త్రేతాయుగంలో ఆ సీతారామస్వామికి పాలించే రాజ్యమున్నా అరణ్య వాసం చేయక తప్పలేదు. ఈ సీతారామస్వామికి అనుభవించే ఆస్తులున్నప్పటికీ పూజకు నోచుకోక చిల్లచెట్ల మధ్య దశాబ్దాలు శిక్ష అనుభవించక తప్పలేదు. ఆలయంలో కొలువున్న శ్రీరామచంద్రునికి గ్రామ నడిబొడ్డున చక్కటి నివాసయోగ్యమైన తగినంత స్థలం, ప్రతి ఏటా ఆదాయాన్ని అందించే సుమారు 3 ఎకరాల మాగాణి భూమి, ఆలయం చుట్టూ పలు వర్గాలు ప్రజలు నివాసం, వారందరి ఇంట సుభిక్షమైన ఐశ్వర్యం కలిగి ఉన్నప్పటికీ ఆయనకు కనీస ధూపదీప నైవేద్యాలు దక్కక ఇప్పటి వరకు కునారిల్లుతూ కొనసాగింది.
శోభిల్లిన దేవాలయం..
చినగంజాం గ్రామంలో ఒకప్పుడు ఎంతో వైభవంగా శోభిల్లింది సీతారామస్వామి ఆలయం. చినగంజాం గ్రామంలోని ప్రస్తుతమున్న 12 పంచాయతీల్లో రామాలయం అంటే తెలియని వారు ఉండేవారు కాదు. ముఖ్యంగా రామునిపై భక్తి విశ్వాసాలను ఎక్కువగా చూపే మత్స్యకార గ్రామాలు సైతం రామాలయం లేని పరిస్థితి ఒకప్పుడు కొనసాగింది. అలాంటి పరిస్థితిలో చినగంజాం రామాలయంలో మండల ప్రజలందరూ తమ ఇంట జరిగే శుభకార్యాలను సీతారామస్వామి ఆలయానికి వచ్చి నిర్వహించుకునే వారు. ముఖ్యంగా వివాహాలను సీతారామస్వామి ఆలయంలో నిర్వహిస్తూ ఎంతో సంతృప్తి చెందేవారు. ప్రతి శ్రీరామ నవమి పండుగను గుడిలో ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించుకునే వారు.
పురాతన రామాలయం ద్వారం తెరిచే కార్యక్రమం..
చినగంజాం గ్రామంలో రామాలయ నిర్మాణానికి మొదలుగా 100 ఏళ్ల నాటి పురాతన దేవాలయం సీతారామస్వామి ఆలయ ద్వారం తెరచే కార్యక్రమానికి ఆగమ శాస్త్ర పండితులు అగ్నిహోత్రం వెంకట శేషాచార్యులుచే డిసెంబరు 22న ముహుర్తంగా నిర్ణయించి సింహద్వారం తెరిచారు. చినగంజాం గ్రామ ప్రజలంతా ఐకమత్యంగా ఉండి చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీరాముని ఆశీస్సులు నిండుగా ఉండాలని గ్రామ ప్రజలంతా భక్తిపూర్వకంగా నిండుమనస్సుతో కోరుకుంటున్నారు.
నెరవేరనున్న చిరకాల కోరిక..
ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయ నిర్మాణం చేయాలని ప్రజల చిరకాల వాంఛ తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా స్థానిక భావన్నారాయణస్వామి ఆలయంలో ఉంచిన సీతారామస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను భావన్నారాయణ స్వామి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 2006 నుంచి ప్రతి ఏడారా శ్రీరామ నవమి రోజున కల్యాణోత్సవం వైభవంగా జరిపిస్తూ వస్తున్నారు. గ్రామంలో సీతారామస్వామి ఆలయం ఉండి తీరాలనే సంకల్పం గ్రామస్తులకు కలిగింది. గ్రామ ప్రజలందరూ ఏకమై ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి ఆలయం నిర్మాణానికి ప్రజలు, భక్తుల భాగస్వామ్యంతో దేవదాయ శాఖ అధికారులు రూ. కోటి నగదు అవసరమని ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. ఇందుకోసం సీతారామస్వామి దేవస్థానం ఆలయం అభివృద్ధి కమిటీని చినగంజాం గ్రామ ప్రజలు వలివేటి వెంకట రామానుజం, మోటుమర్రి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రజలు 35 శాతం భాగస్వామ్యంతో రూ.35లక్షలు విరాళల రూపంలో సేకరించి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు.





