News

సంభల్ ఎంపీకి రూ. 1.91కోట్ల జరిమానా

398views

ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో హింసాత్మక ఘటనలో కారణమైన సంభాల్‌ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్‌ రెహమాన్‌ మరో చర్యకు పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్‌ రెహమాన్‌ బర్క్‌కు విద్యుత్తుశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. విద్యుత్తు చోరీకి పాల్పడినట్లు కేసు నమోదుచేసి రూ.1.91 కోట్ల జరిమానా విధించడమే కాకుండా ఆయన ఇంటి విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్లు జియావుర్‌పై ఆరోపణలు ఉండటంతో దీప్‌ సరాయ్‌ ప్రాంతంలోని ఎంపీ ఇంటికి ఆ శాఖ అధికారులు వెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య గురువారం తనిఖీలు నిర్వహించారు. రెండు పాత మీటర్లను తొలగించి, కొత్త స్మార్ట్‌ మీటర్లను అమర్చారు. ఆ తర్వాత పాత మీటర్లకు సీలు వేసి పరీక్షలకు పంపారు. విద్యుత్తు మీటర్లతో సంబంధం లేకుండా ఎంపీ ఇంటికి అధిక విద్యుత్తు సరఫరా కొనసాగినట్లు గుర్తించారు. దీంతో జియావుర్‌పై విద్యుత్తుచౌర్యం కేసు నమోదుచేసి, భారీ జరిమానా విధించారు. తనిఖీల సమయంలో అధికారులను బెదిరించారంటూ రికార్డెడ్‌ వీడియో ఆధారంగా ఎంపీ తండ్రి మమ్లుకూర్‌ రెహమాన్‌ బార్క్‌పై పోలీసు కేసు నమోదు చేశారు.

కాగా సంభాల్‌లో హింసాత్మక ఘటనలో కారణమైన కేసు నమోదైన వారిలో సంభాల్‌ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్‌ రెహమాన్‌, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్‌ మెహమూద్‌ కుమారుడు సోహైల్‌ ఇక్బాల్‌ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.