( డిసెంబర్ 5 – పారుపల్లి రామకృష్ణయ్య పంతులు జయంతి )
తమ జీవితకాలంలో తెలుగుదేశాన్నేగాక, యావద్భారతావనినీ ఆకర్షించి తెలుగువెలుగును నలుదిక్కుల వెదజల్లినవారిలో ‘గాయక సార్వభౌమ’ కీర్తిశేషులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు ఒకరు. 1882 డిసెంబర్ 5న ఆంధ్రసామ్రాజ్య ముఖ్యనగరమై విలసిల్లిన కృష్ణా జిల్లా శ్రీకాకుళమున శేషాచలం, మంగమాంబ దంపతులకు జన్మించిన ఈ పుణ్యమూర్తి త్యాగరాజస్వామివారి శిష్యపరంపరలో మూడవ తరానికి చెందినవారు. సాక్షాత్తు త్యాగరాజస్వామి శిష్యుడు, తంజావూరులోని మానాంబుచావడి గ్రామనివాసి, ఆంధ్రుడైన ఆకుమడుల వెంకటసుబ్బయ్యకు శిష్యుడైన సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి గారి శిష్యులే పారుపల్లివారు.
ఆంధ్రరాష్ట్రంలో శాస్త్రీయ సంగీత పునరుజ్జీవనానికి మూలపురుషులైన పారుపల్లివారు జంత్రగాత్రాలలో బహుముఖ ప్రజ్ఞావంతులైన సంగీత విద్వాంసులు. విజయవాడను కేంద్రబిందువుగా చేసుకొని ఆంధ్రదేశాన శాస్త్రీయ సంగీత ప్రాచుర్యానికి పునాదులు వేశారు. ఆ రోజులలో విజయవాడ పరిసర ప్రాంతాలలో సంగీత కళాశాలలు లేని కారణంగా ఆయన గురుకులమే ఒక విశ్వవిద్యాలయం. శాస్త్రములో చెప్పబడిన గాయక లక్షణాలన్నీ మూర్తీభవించేటట్లు ఉండేది పంతులుగారి విగ్రహం.
శిష్యులు, అంతేవాసులు ఎవరి సాధనలో వారుంటే – అయ్యవారు క్షణక్షణం పర్యవేక్షణ చేస్తూ చెప్పవలసినవి చెప్పి, పాడించి, ప్రతి శిష్యునకు తన బోధనా భాగ్యాన్ని కలుగచేసేవారు. ప్రతీ విద్యార్థికి గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్పేవారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా గాత్రం మూగపోతే వయోలిన్‌తో జీవనోపాధి కొనసాగించవచ్చు అనే దూర దృష్టి ఆయనది. పారుపల్లివారి సంప్రదాయశుద్ధి, గాత్ర మాధుర్యం చూసి ఎంతోమంది దాక్షిణాత్యులు ఆయనను ఆదరించి ప్రోత్సహించడమే కాకుండా, వారిని మద్రాసులో స్థిరనివాసం ఏర్పరచుకోవలసిందిగా ఒత్తిడి చేశారు. ఆలా చేయడంవల్ల వారికి కలిగే ఆర్ధిక యశోలాభాలను గూర్చికూడా ఆశపెట్టారు. దానికి పారుపల్లివారు ‘నా ఆంధ్రదేశములో కూడా తమిళనాడు వలె సంగీతం బహుజన వ్యాప్తంగా వృద్ధిపొందేటట్లు చేయడమే నా జీవిత ధ్యేయం’ అని అన్నారు. ఆ లక్ష్యంతోనే తమ స్వగ్రామమైన కృష్ణా జిల్లా దివిసీమ తాలూకా, శ్రీకాకుళం వదిలిపెట్టి విశాలాంధ్ర వసుంధరా కేంద్రబిందువైన విజయవాడలో స్థిరనివాసం ఏర్పరచుకొని జీవితాంతం వరకు తమ ఆదర్శాన్ని అమలుపరచడంలోనే గడిపారు.
గురువుగారైన సుసర్ల దక్షిణామూర్తి వర్యుల ఆరాధన ఉత్సవాలు ప్రతి ఏటా పారుపల్లివారు ఘనంగా జరిపేవారు. 1940 జూలైలో పారుపల్లివారు ముఖ్యమైన పని మీద తన స్వగ్రామానికి వెళ్ళవలసి వచ్చి, వార్షికోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు సీనియర్ విద్యార్థి అయిన నేతి లక్ష్మీనారాయణ భాగవతులుకు అప్పగించారు. ఈయన, ఇతర సహాధ్యాయుల సూచనలతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుకూడా ఆహ్వానపత్రంలో చేర్చారు. గ్రామం నుండి తిరిగి వచ్చిన తరువాత పారుపల్లివారు కార్యక్రమ పత్రికలో మురళి పేరు చూసి నివ్వెరపోయి, ‘బాలమురళి కొద్దిరోజుల నుండి మాత్రమే నా దగ్గర సంగీతాన్ని నేర్చుకుంటున్నాడు, దీనివల్ల ఉత్సవముల స్థాయి తగ్గుతుంది కదా’ అని -మందలించారు. కానీ, జూలై 18, 1940 రోజున బాలమురళి కచేరీ ప్రకటిత 30 నిమిషాలకు బదులు సుమారు రెండుగంటలకు పైగా కొనసాగి శ్రోతల ప్రశంసలందుకోవటంతో పారుపల్లివారు ఉప్పొంగిపోయారట. అయన దగ్గర శిష్యరికం చేసిన ప్రతి వ్యక్తీ ఒక విద్వాంసుడుగా పేరుపొంది, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండేవారు. ఆ రోజుల్లో దాక్షిణాత్యులు గుర్తించి ఆదరించిన కొద్దిమంది ఆంధ్ర సంగీత విద్వాంసులలో పారుపల్లివారు ఒకరు. మద్రాసు సంగీత అకాడమీ నిపుణుల సంఘంలో సభ్యుడుగా చాలాకాలం పనిచేయడంతోపాటు తిరువాయూరులోని త్యాగబ్రహ్మ ఆరాధన ఉత్సవ కార్యక్రమ నిర్వాహక సభ్యునిగా కూడా ఉన్నారు. కొలంబియా గ్రామఫోన్ కంపెనీ అయన కార్యక్రమాలను రికార్డు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసి అనేక బిరుదులూ, పురస్కారాలు అందుకొన్నారు. పూనాలోని తెలుగు, తమిళ, మహారాష్ట్ర సంఘాలు ఘనంగా సత్కరించాయి. 1915 ప్రాంతములో మద్రాసు గవర్నర్ లార్డ్ పెంట్లాండ్ తెనాలి వచ్చి సువర్ణపతకం బహుకరించారు. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో, 1927లో చెన్నపట్నంలో జరిగిన అఖిల భారత సంగీత సభలో కచేరీలు చేసి ప్రముఖుల, విద్వాంసుల, శ్రోతల మన్నలను ఆకట్టుకున్నారు.
అక్షరాలకందని ప్రతిభ పారుపల్లివారిది. శిష్యుల పేర్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా మార్మోగటం పారుపల్లివారు చేసుకున్న అదృష్టం. విజయవాడలో వారి గురుకుల శిక్షణలో తయారైన ఉద్దండులలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, అన్నవరపు రామస్వామి, నేతి శ్రీరామశర్మ, ముసునూరి వెంకటరమణమూర్తి, తిరుపతి పొన్నారావు, దాలిపర్తి పిచ్చహరి సోదరులు, టి.కె. యశోదదేవి, జి.వి.రామకుమారి ఇత్యాదులున్నారు. పంతులుగారి శిష్యులు కొల్లలయితే, ప్రశిష్యులు కోకొల్లలు.
‘పారుపల్లియనెడి పావన నామంబు, విజయవాడలోన వెలయకున్న, ఏ స్థితిని గనెదమో? ఏ గతి నుందుమో? మాదృశులగు మందమతులు నేడు’ అనేవారు కీర్తిశేషులు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. పంతులుగారి కృషి, ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో ప్రప్రథమముగా ఆకాశవాణి కేంద్రం, తదుపరి సంగీత కళాశాల ప్రారంభమైనవి. వీటిలో పనిచేసిన నిలయ విద్వాంసులు, ఆధ్యాపకులలో పలువురు వారి శిష్య, ప్రశిష్యులే. దక్షిణ భారతదేశంలో కన్నడిగులు, తమిళుల సంగీత ప్రతిభే ప్రామాణికంగా చలామణి అవుతున్న ఆ రోజులలో తెలుగువాడి స్వరాన్ని విశ్వవ్యాప్తం చేసిన విశిష్టమూర్తి పారుపల్లివారు. ఆయన జయంతి, గురుపూజ ఉత్సవాలు ఇప్పటికీ వారి శిష్య ప్రశిష్యులు విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నేతి శ్రీరామశర్మ హైదరాబాదులో సుమారు రెండు దశాబ్దాలపాటు గురువుగారి ఉత్సవాలు ఘనంగా జరిపించి వర్ధమాన గాయకులందరిచేత పాడించి ప్రోత్సహించేవారు. ఖండాంతర ఖ్యాతి నార్జించిన ‘సంగీత కళానిధి’ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ‘నాదసుధార్ణవ’ అన్నవరపు రామస్వామి వంటివారినెందరినో బహుముఖ సంగీత విద్వాంసులుగా తయారుచేసి ఆంధ్రదేశానికి సమర్పించిన గాయక సార్వభౌములు పారుపల్లివారు. సంగీతజ్ఞానంలో ఆంధ్రదేశాన్ని చైతన్యవంతం చేసిన మహామనీషిగా, యుగకర్తగా ప్రాతఃస్మరణీయులైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు 1951వ సంవత్సరం జూలై 7వ తేదీ తమ గురువులు దక్షిణామూర్తిశాస్త్రి గారి ఆరాధనోత్సవములు జరుపుతున్నవేళ సంగీత సరస్వతి ఒడికి చేరుకున్న ధన్యజీవి.