News

బంగ్లాపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

222views

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ నాయకుడు, ఆఽధ్యాత్మిక వేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుతో పాటు హిందువులపై జరుగుతున్న దాడులు, హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ 68 మంది ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వీరిలో ఓ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి, పలువురు మాజీ ఐఏఎస్‌, ఏపీఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు, ఒక ఎంపీ తదిరులు ఉన్నారు. హిందువులు, వారి ఆస్తులు, ఆలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇవి తీవ్రస్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. మహిళలపై హింస మరింత ఆందోళనకరమని, అపహరణలు, బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక హింస, మానవ అక్రమ రవాణా వంటికి చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయని తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమబెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం కేంద్రానికి మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ఏ మతానికైనా నష్టం జరగాలని మేం కోరుకోం. ఇక్కడి ఇస్కాన్‌ వాళ్లతో నేను మాట్లాడాను. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్రానికి మద్దతుగా ఉంటాం. బంగ్లాదేశ్‌ వేరే దేశం కావున, మా పరిధిలోకి రాదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఆ బాధ్యత బంగ్లాదేశ్‌పైనే ఉంది: కేంద్రం
బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలను, దేవతామూర్తులను అపవిత్రం చేయడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాల భద్రతకు భరోసా ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. ఆ దేశంలో నివసించే మైనారిటీల ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.