ArticlesNews

సంభల్‌లోని కల్కి మందిరం గురించి ఎఎస్ఐ 1879 నివేదిక ఏం చెప్పింది?

42views

24 నవంబర్ 2024 ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో హింసాకాండ చెలరేగింది. కారణం, ఆ పట్టణంలోని షాహీ జామా మసీదులో న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడానికి ఏడుగురు సభ్యుల బృందం అక్కడికి చేరుకోవడమే. ఆ బృందం మసీదులోకి ప్రవేశించగానే వందల మంది ముస్లిములు దానిచుట్టూ గుమిగూడి పోయారు. కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి అరాచకంగా మారింది. రాళ్ళు రువ్వారు, వాహనాలకు నిప్పుపెట్టారు, తుపాకులతో కాల్చారు. ఆ హింసలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాకాండ తర్వాత 24 గంటలు దాటినా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పాఠశాలలు మూసేసారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలు సస్పెండ్ చేసేసారు. జనాలు గుంపులుగా గుమిగూడరాదంటూ నిషేధాజ్ఞలు జారీచేసారు.

ఆ హింసకు కారణం సుదీర్ఘకాలంగా షాహీ జామా మసీదు గురించి నడుస్తున్న వివాదం, దాని చారిత్రక ప్రాధాన్యం. కల్కి భగవానుడికి అంకితం చేసిన ప్రాచీనమైన హరిహర మందిరాన్ని పడగొట్టి దానిమీద ఆ మసీదు నిర్మించారని హిందువులు చెబుతుంటారు. దానిగురించి చరిత్రకారులు ఏం చెబుతారు? అక్కడ స్వతంత్రానికి పూర్వమే 1879లో పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) సర్వే చేసి సమర్పించిన నివేదికలో ఏముంది?

సంభల్ షాహీ జామా మసీదులో సర్వేకు కోర్టు ఎందుకు ఆదేశించింది?
జామా మసీదును కల్కి మందిరాన్ని పడగొట్టి కట్టారని హిందువుల వాదన. హిందూ పక్షం తరఫున న్యాయవాది విష్ణు జైన్ ఈ యేడాది నవంబర్ 19న కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ ప్రకారం, విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి భగవానుడిని స్మరించుకుంటూ హరిహర మందిరం (కల్కి మందిరం) చాలాకాలం క్రిందటే నిర్మించారు. ఆ కల్కి మందిరాన్ని 1526లో మొగల్ రాజు బాబర్ కూల్చివేసాడు. దాని శిథిలాల మీదనే మసీదు నిర్మించారు. ఆ దేవాలయాన్ని జామా మసీదు కమిటీ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకుందని పిటిషనర్లు వాదించారు.

కేసు విచారణ మొదలయ్యాక న్యాయస్థానం నవంబర్ 24నే ఆ మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఆ మేరకు అడ్వొకేట్ జనరల్‌ను కూడా నియమించింది. సర్వే బృందానికి వాహనాలు, నిధులు సమకూర్చింది. నవంబర్ 24న, సర్వే చేయవలసిన రోజే సంభల్‌లో హింసాకాండ చెలరేగింది. నవంబర్ 29కల్లా కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

పశ్చిమ యూపీలోని సంభల్‌ ప్రాంతం విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి అవతరించే ప్రదేశమని హిందువుల విశ్వాసం. ఆ ప్రాంతం హిందువులకు అమిత ఆరాధనీయమైనది. కల్కి అవతారం చెడు బుద్ధులను నాశనం చేసి, మంచి బుద్ధులను ఆదరిస్తుంది. అందుకే మొగల్ చక్రవర్తి బాబర్, హిందువులను చావుదెబ్బ కొట్టడానికి ఏం చేయాలి అని ఆలోచించి సంభల్‌ ఆలయాన్ని ధ్వంసం చేసాడు.

మీనాక్షి జైన్, శ్రీరామ్ శర్మ వంటి చరిత్రకారులు బాబర్ హయాంలో సంభల్‌లో ప్రాచీన దేవాలయం కూల్చివేతను రికార్డు చేసారు. అయోధ్య వంటి పలు ప్రదేశాల్లో లానే సంభల్‌లో కూడా గుడి కూల్చివేతకు బాబరే ఆదేశాలు జారీ చేసాడు.

‘‘బాబర్ భారతదేశంలో నిర్మించిన రెండో మసీదు సంభల్‌లోనిదే. అప్పటికే ఉన్న మందిరాన్ని కూల్చివేసి మసీదు నిర్మించాలని తన సైనికాధికారిని బాబర్ ఆదేశించాడు.. ’’ అని మసీదు మీదున్న శిలాశాసనం, ఆ మసీదు బాబర్ ఆదేశాల మేరకే నిర్మితమైందని స్పష్టం చేసింది. కూల్చివేసిన ఆలయ సామగ్రిని మసీదు నిర్మాణంలో వాడారని కూడా ఆ శిలాశాసనం చెప్పింది. ఆ విషయాన్ని తన రచన ‘ది బ్యాటిల్ ఫర్ రామా – ది కేస్ ఆఫ్ ది టెంపుల్ ఎట్ అయోధ్య’ అనే పుస్తకంలో మీనాక్షీ జైన్ సవివరంగా రాసుకొచ్చారు. ‘బాబర్ అధికారుల్లో ఒకడైన హిందూ బేగ్, సంభల్‌లోని దేవాలయాన్ని మసీదుగా మార్చేసాడు’ అని, చరిత్రకారుడు శ్రీరామ శర్మ 1940 నాటి తన రచన ‘ది రెలిజియస్ పాలసీ ఆఫ్ ది ముగల్ ఎంపరర్స్’లో రాసాడు.

ఈ కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న విష్ణు జైన్, తన వాదనలో బాబర్ జీవితచరిత్ర బాబర్‌నామాను కూడా రిఫరెన్స్‌గా ఉటంకించారు.

విష్ణు జైన్ వివరణ ప్రకారం సంభల్ లోని ఆలయాన్ని మసీదుగా మార్చేయాలని 933 హిజరీ సంవత్సరంలో బాబర్ ఆదేశించాడు. ఆ విషయాన్ని ధ్రువీకరించే శాసనం ఆ మసీదులో ఇప్పటికీ ఉంది. ఆ హరిహర మందిరాన్ని కల్కి భగవానుడికి అంకితం ఇచ్చారనీ ఆ శాసనం తెలియజేస్తోంది.

మసీదు నిర్మించిన కొన్ని శతాబ్దాలకు, 18వ శతాబ్దంలో మరాఠా మహారాణి అహిల్యాబాయి హోల్కర్ కల్కి భగవానుడికి కొత్త మందిరం నిర్మించారు. అది షాహీ జామా మసీదుకు300 మీటర్ల దూరంలోనే ఉంది.

1879 ఆర్కియలాజికల్ సర్వే ఏం చెబుతోందంటే… :
భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) 1879లో ప్రచురించిన నివేదికలో బ్రిటిష్ ఆర్కియాలజిస్టు ఎసిఎల్ కార్లయిల్ జామా మసీదు నిర్మాణం గురించి కీలకమైన పరిశీలనలు చేసాడు. ఒక నిర్మాణాన్ని కూలగొట్టి, ఆ రాళ్ళు రప్పలతో మసీదును నిర్మించారని ఆయన గమనించాడు. ఒక క్రమం లేని రాళ్ళను మోర్టార్‌తో కలిపి గోడలు నిర్మించినట్లు ఉందని వివరించాడు. ‘‘ఆ డోమ్ ఇటుకలతో కట్టి ఉంది. దాన్ని ప్రముఖ రాజయిన పృథ్వీరాజు పునర్నిర్మించాడని చెబుతారు’’ అని ఆయన రాసాడు. మసీదు ప్రధాన నిర్మాణం ఒక హిందూ మందిరం శిథిలాల మీద నిర్మించబడింది అని ఆయన పదేపదే ప్రస్తావించాడు.

‘‘హిందూగుడిలో పెద్దపెద్ద ఇటుకలు, రాళ్ళతో నిర్మించిన మండపం మధ్యలో ఉంది. అయితే ముస్లిములు దాని గోడలను ప్లాస్టర్‌తో కప్పిపెట్టేసారు’’ అని కార్లయిల్ గమనించాడు. ఆ ప్లాస్టర్ పెచ్చులు ఊడి పడిపోయిన పలు ప్రదేశాలను పరిశీలించిన కార్లయిల్ ఇలా రాసుకొచ్చాడు. ‘‘ముస్లిములు ఈ రాళ్ళను అంతకు ముందు ఎక్కడో పడగొట్టారు, అవి హిందూ ఆలయాలకు చెందినవే. ఆ రాళ్ళతో దారి చేసారు. విగ్రహాలను తలక్రిందులుగా అమర్చారు’’ అని వివరించాడు.

ముందు ఒక నిర్మాణాన్ని పడగొట్టి, దాని శిథిలాలతో ఒక నిర్మాణాన్ని రూపొందించే పద్ధతిని రబుల్ మేసన్రీ అంటారు. కార్లయిల్ పేర్కొన్న ఆ విషయాన్నే, మీనాక్షీ జైన్ వంటి చరిత్రకారులు మరింత నేరుగా చెప్పారు. అదేంటంటే, ‘హిందూ దేవాలయాన్ని పడగొట్టి, దాని శిథిలాలతోనే మసీదు నిర్మించారు’.

సంభల్ మసీదులోని బాబర్ శాసనంపై చర్చ:
కార్లయిల్ తన 1879 నాటి నివేదికలో జామా మసీదులోనిదిగా చెప్పబడుతున్న శాసనం ప్రామాణికత మీదనే అనుమానాలు వ్యక్తం చేసాడు. ఆ మసీదును మొగల్ చక్రవర్తి బాబర్ నిర్మింపజేసాడు అనడానికి ఆ శాసనాన్నే ఆధారంగా ఇన్నాళ్ళూ చూపిస్తున్నారు. సంభల్‌ పట్టణంలోని స్థానిక ముస్లిములు, బాబర్ పేరుతో ఉన్న ఆ శాసనం నకిలీది అని కార్లయిల్ ముందు ఒప్పుకున్నారు. దాన్ని బట్టి, ఆ మసీదు 1857 తిరుగుబాటు వరకూ, అంటే కార్లయిల్ ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి సుమారు పాతికేళ్ళ ముందు వరకూ ముస్లిముల నియంత్రణలో లేదు.

‘‘బాబర్ పేరుతో ఉన్న శాసనం ఫోర్జరీ అని, 1857 వరకూ ఆ భవనం తమ నియంత్రణలోకి రాలేదనీ సంభల్ ప్రాంత ముస్లిములు నా దగ్గర ఒప్పుకున్నారు’’ అని కార్లయిల్ తన ‘రిపోర్ట్ ఆఫ్ టూర్స్ ఇన్ ది సెంట్రల్ దోయబ్ అండ్ గోరఖ్‌పూర్‌’లో రాసుకొచ్చాడు.

ఆ శాసనంలో బాబర్ పేరు తప్పుగా రాసి ఉండడంతో దాని ప్రామాణికతపై అనుమానాలు తలెత్తాయి. దానికి ఎఎస్ఐ మొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ జవాబు కనుగొన్నాడు. కార్లయిల్ నివేదికకు అనుబంధంలో కన్నింగ్‌హామ్, ‘‘మసీదు మీది ఈ శాసనం నకిలీది అని హిందువులు చేస్తున్న వాదన నమ్మదగినదిగానే ఉంది. దానిమీద పూర్తి తేదీని తెలివిగా రాసిన తీరును బట్టి ఆ విషయం అర్ధమవుతోంది’’ అని రాసాడు.

1879 ఎఎస్ఐ నివేదిక మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఆ రాతిదిమ్మ మీద బాబర్ శాసనం ఒకవైపు ఉంటే, దానికి మరోవైపు అసలైన హిందూ శాసనం ఉందని స్థానిక హిందువులు చెబుతున్నారు. దాన్ని బట్టి ఈ మసీదు మూలాల గురించి, ఆలయ విధ్వంసం గురించీ జరుగుతున్న చారిత్రక చర్చలో మరొక సంక్లిష్ట అంశం చేరిందన్నమాట.

కల్కిధామ్ మందిరానికి మోదీ శంకుస్థాపన:
ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభల్‌లో కల్కిధామ్‌ మందిరానికి శంకుస్థాపన చేసారు. వివాదాస్పద జామా మసీదుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఆ కొత్త గుడి నిర్మిస్తున్నారు. ఆ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కల్కిధామ్ భారతీయుల విశ్వాసానికి గొప్ప శ్రద్ధాకేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

‘‘శ్రీరామచంద్రుడు పరిపాలించినప్పుడు ఆయన ప్రభావం వేల యేళ్ళు ఉండిపోయింది. ఆయన గొప్ప వారసత్వాన్ని ఇచ్చారు. అదేవిధంగా కల్కి కూడా ఈ ప్రపంచాన్ని వేయేళ్ళు ప్రభావితం చేస్తారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

కల్కిధామ్ మందిరాన్ని శ్రీ కల్కిధామ్ నిర్మాణ్ ట్రస్టు నిర్మిస్తోంది. ఈ యేడాది ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణమ్, ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు జామా మసీదులో సర్వే నిర్వహించడానికి ప్రయత్నించడం భారీ హింసాకాండకు దారితీసింది. బాబర్ కాలంలో శతాబ్దాల నాటి ప్రాచీన కల్కి ఆలయాన్ని పడగొట్టి దానిమీద మసీదు నిర్మించారన్న విషయంలో నిజానిజాలను తేల్చడానికి కోర్టు సర్వేకు ఆదేశిస్తే, దాన్ని ముస్లిములు యథేచ్ఛగా ఉల్లంఘించడమే కాదు, ఆ సర్వేకు వచ్చిన బృందంపైనే దాడికి పాల్పడడం భయంకరమైన సంఘటన. ఆ హింసాకాండలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం. అంతకంటె ఆశ్చర్యకరం ఏంటంటే, సంభల్‌లో ముస్లిములు ప్రార్థనలు చేసుకుంటున్న ఆ స్థలం నిజానికి ఎన్నో శతాబ్దాల నుంచీ ఎఎస్ఐ రక్షిత స్థలం. అక్కడ నమాజులు ఎలా చేసుకుంటున్నారో అడిగి బతికి బట్టకట్టే వారున్నారా?