News

బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే

227views

బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే అంటూ చేపట్టిన సామూహిక కోలాట నృత్య ప్రదర్శన విశేషంగా అలరించింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా అన్నమయ్య డాన్స్‌ అకాడమీ కన్వీనర్‌ రాంబాబు ఆధ్వర్యంలో వర్సిటీలోని జ్ఞానప్రద వేంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట 1,250మందితో నృత్య ప్రదర్శన నిర్వహించారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధుల సమక్షంలో చేపట్టిన ఈ విశిష్ట కార్యక్రమాన్ని ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు, ఎన్‌ఎస్‌యూ వీసీ కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తన బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే గీతం సమస్త జగత్తులో అందరూ సమానమేని చాటుతుందని వెల్లడించారు.

అరుదైన ఘట్టం
అన్నమయ్య సంకీర్తనను దాదాపు 1,250మంది కోలాట కళాకారులు నృత్య ప్రదర్శనతో ఆలపించడం అరుదైన ఘట్టమని వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు బి.నరేంద్రగౌడ్‌, అరుణ్‌కుమార్‌ కొనియాడారు. ఈ ప్రక్రియను రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు అభినందనలు తెలిపారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌ను ముఖ్య అతిథులు చేతుల మీదుగా నిర్వాహకులకు అందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ పాకనాటి హరికృష్ణ, ఆర్‌కే అబాకస్‌ అధినేత రామకృష్ణారెడ్డి, ఇంజినీర్‌ తాండవకృష్ణ, డాక్టర్‌ ఆనంద్‌, రవీంద్రబాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు.