ArticlesNews

పరాక్రమానికి ప్రతీక లచిత్ బోర్ఫూకన్

218views

( నవంబర్ 24 – లచిత్ బోర్ఫూకన్ జయంతి )

భారత్‌లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదే పదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ఫుకాన్ ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు. లచిత్ బోర్ఫుకాన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయ్‌ఘాట్ యుద్ధంలో రామ్‌సింగ్ 1 నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూప్‌ని తిరిగి సాధించిన ఘనత లచిత్‌కే దక్కుతుంది.

లచిత్ బోర్ఫుకాన్ అస్సాం చూసిన గొప్ప యోధులలో ఒకరు. ఆయన 1622 నవంబరు 24న జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు లచిత్ డేకా. అతని తండ్రి పేరు మొమై తములి. బోర్బరువా. ఈయన రాజా ప్రతాప్ సింఘా పాలనలో అహోం రాజ్యానికి సర్వసైన్యాధికారిగా ఉన్నారు. తండ్రి ఆలనా పాలనలో పెరిగిన లచిత్ డేకా చిన్నతనం నుంచే సైనిక శిక్షణ పొంది సైన్యంలో వివిధ హోదాల్లో పని చేసి చివరికి చక్రధ్వజ్ సింఘా పాలనలో 1667 ఆగస్టులో బోర్ఫుకాన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి లచిత్ డేకా…లచిత్ బోర్ఫుకాన్‌గా ప్రసిద్ధి చెందారు. అహోం రాజ్య సర్వ సైన్యాధికారిగా నియమితుడైన వెంటనే మొఘలుల ఆక్రమణలో ఉన్న గువహతిని తిరిగి పొందటానికి వారితో లచిత్ యుద్ధాన్ని ప్రారంభించాడు. 1667 నవంబరు నాటికి లచిత్ తన సైనిక పరాక్రమంతో అస్సాం సరిహద్దుల్లో కూడా మొఘల్ సైన్యం ఆనవాళ్లు లేకుండా వారిని తరిమికొట్టాడు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఓటమికి రగిలిపోతూ అంబేర్ రాజు రామ్ సింగ్ కచ్వాహా ఆధ్వర్యంలో బలమైన మొఘల్ సైన్య బృందాన్ని 1668 జనవరిలో లచిత్ బోర్ఫుకాన్ సేనను ఓడించడానికి పంపాడు. అలా, 71 వేల మంది మొఘల్ దళాలతో కలిసి రామ్ సింగ్ కచ్వాహా అహోం రాజ్యంపై యుద్ధానికి దిగగా, మరోవైపు లచిత్ బోర్ఫుకాన్ కొన్ని వేలమంది సైనికులతో మాత్రమే పోరాటం చేశాడు. మొఘల్ నాయకులు మోసపూరితంగా అహోంల మధ్య అసమ్మతి తీసుకొచ్చి చీలిక కోసం ప్రయత్నించారు. లచిత్‌కు డబ్బు ఆశ చూపించారు. అహోం రాజుకి లచిత్‌ విశ్వాసపాత్రతపై సందేహం కలిగించేలా కుట్రలు చేశారు. మొఘల్ పన్నాగాలేవి ఫలించకపోవడంతో గౌహతి విడిచిపెట్టి 1639లో సంతకాలు చేసిన పాత ఒప్పందానికి మళ్ళీ కట్టుబడేందుకు అహోం లకు 300,000 లక్షల రూపాయలు ఇస్తానని రామ్ సింగ్ బేరం పెట్టాడు. అది ఫలించలేదు.

లచిత్ ముందుండి పోరాటానికి నాయకత్వం వహించడమే కాక ప్రతి పోరాటంలో మొఘలులను ఓడించాడు. మొఘలులపై లచిత్ పోరాటానికి పరాకాష్ట 1671లో బ్రహ్మపుత్ర నది పై జరిగిన చివరి సరైఘాట్ యుద్ధం. ఈ యుద్ధం సమయానికి లచిత్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో యుద్ధ ఏర్పాట్లలో పర్యవేక్షణ కొరవడి అహోం సైన్యంలో నిస్తేజం ఆవరించింది. ఇది గమనించిన లచిత్ ఏది ఏమైనా, ఏం జరిగినా తానూ తన దేశాన్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశాడు. తమ అధిపతి లేచి, శక్తి కూడగట్టుకుని నిలబడడం అహోం సైన్యానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. సైనికులందరూ లచిత్ వెంట వెళ్లి నిలబడడంతో, మళ్ళీ సైన్యం పరిమాణం పెరిగింది. అహోంలు తమ చిన్న పడవలను తీసుకుని ముందుకి సాగగా, లచిత్ వారిని మొఘల్ సైన్యంతో నది మధ్యలో ముఖాముఖి పోటీకి తీసుకుని వెళ్ళాడు. మొఘల్ సైన్యానికి చెందిన పెద్ద నౌకల కంటే, చిన్న అహోం పడవలకి నది నీటిలో వెసులుబాటు ఎక్కువ ఉండడంతో, పెద్ద నౌకలు చిక్కుకుని పోయాయి. అప్పుడు జరిగిన పోరాటంలో మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. మొఘల్ నౌకాదళాధిపతి మునావర్ ఖాన్, అనేకమంది కమాండర్లు, పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారు. అహోంలు తమ భూభాగానికి పశ్చిమ సరిహద్దు అయినా మానస్ వరకు మొఘలులని తరిమికొట్టారు.

సరైఘాట్‌లో నిర్ణయాత్మక యుద్ధం జరిగిన సంవత్సరం తర్వాత 1672 ఏప్రిల్ నెలలో లచిత్ వీర మరణం పొందాడు. హూలంగాపారాలో మహారాజ ఉదయాదిత్య సింగ్ నిర్మించిన లచిత్ మైదానంలో 1672లో ఆయనకు తుది విశ్రాంతి కల్పించారు. ఆయన విగ్రహాన్ని 2000 సంవత్సరంలో అప్పటి అసోం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ SK సిన్హా ఖడక్ వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఆవిష్కరించారు. ప్రతి ఏడాది పాస్ అవుట్ అయ్యే అత్యుత్తమ క్యాడెట్‌కు లచిత్ పతకాన్ని బహుకరిస్తున్నారు. భారతమాత ముద్దుబిడ్డ అయిన లచిత్‌ని గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ 24ను లచిత్ దివస్‌గా జరుపుకుంటున్నాము. సరైఘాట్ యుద్ధంలో వీర లచిత్ బోర్ఫుకాన్ చూపిన పరాక్రమం, మాతృభూమిపై అసమానమైన ప్రేమ మనందరికీ ప్రేరణ కావాలి.