ArticlesNews

వ్యాసుడు భాగవతం ఎందుకు రాశాడు?

286views

వ్యాసమహర్షి వేదరాశిని విభజించాడు. విశేషంగా మహాభారత రచనను ముగించాడు. సరస్వతీ నదీతీరాన బదరికాశ్రమంలో ఏకాంతంగా కూర్చున్నాడు. అన్ని రచనలు చేసినా.. ఆయన మనసులో ఏదో అసంతృప్తి. మానవజాతికి ముక్తిని ప్రసాదించే రచన ఇంకేదో మిగిలిపోయిందని మనోవ్యథ. ‘విశిష్ట రచనలు చేశాను. వేదాలు విభజించాను. పంచమ వేదమైన భారతాన్ని లోకానికి పరిచయం చేశాను. అయినా నా అంతరాత్మకు సంతుష్టి లేదు. కారణమేంటో అర్థం కావటం లేదు’ అని వ్యాసుడు వేదన చెందుతున్నాడు.

అప్పుడే నారాయణ నామస్మరణతో నారదుడు అక్కడికి వచ్చాడు. వ్యాసమహర్షి తన మనసులోని మాటను ఆయన ముందుంచాడు. ముని మాటలు విన్న ఆ త్రిలోక సంచారి ‘వ్యాసా! నువ్వు ధర్మ విశేషాలన్నీ వెల్లడించావు. కానీ ఏ రచనలోనూ వాసుదేవుని గుణవిశేషాలను వర్ణించలేదు. ఎన్ని ధర్మాలు వివరించి చెప్పినా భగవంతుడు సంతోషపడడు. ఆయన సంతసించేది భక్తికథలకే. శ్రీహరి నామ సంకీర్తన లేని కావ్యం ఎన్ని శబ్దార్థాలతో కూడినా, దుర్గంధ భూయిష్టమై, కాకులు మూగిన బురదగుంట లాంటిది’ అన్నాడు. ఆ భగవంతుడే నారదుడి రూపంలో వచ్చి తనకు కర్తవ్యాన్ని గుర్తుచేశాడని వ్యాసుడు నిశ్చయించుకున్నాడు.

ఆ భక్తపుంగవుడి ద్వారా విన్న నవనీతచోరుడి గుణవిశేషాలను భాగవత కథాగానంగా వినిపించాడు. ‘వేలకొద్దీ వేదాలు వల్లించినా మోక్షసౌభాగ్యాలు సంప్రాప్తించవు. భాగవతమనే సారస్వతాన్ని అధ్యయనం చేస్తేనే కైవల్యం కరతలామలకం’ అని నిరూపించాడు.