ArticlesNews

కురుక్షేత్ర కేంద్రంగా పర్యాటకాభివృద్ధి

231views

పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో. ఉన్నాయి. వాటి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించడం మంచి ప్రయత్నమే. ఆ పని హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. మహా భారత గాథలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టే చెప్పే ప్రదేశం హరియాణాలో ఉంది. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ కురక్షేత్ర అనే పిలుస్తున్నారు. దీని కేంద్రంగానే పర్యాటక రంగాన్ని వృద్ధి చేయబోతున్నట్టు ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి డాక్టర్ అరవింద్కుమార్ శర్మ తెలియచేశారు. దీనికి ‘మహా భారత సర్కిట్’ అని పేరు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల అధికారులతో ఇటీవల కర్నాల్ లో జరిగిన సమావేశంలో ఈ ప్రణాళిక చర్చకు వచ్చింది.

పురాణ ప్రాధాన్యం కలిగిన కురుక్షేత్ర, చారిత్రక ప్రాధాన్యం కలిగిన కర్నాల్, పానిపట్ ల అభివృద్ధి గురించి చర్చించారు. వీటిని ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దాలన్నదే వారి ప్రయత్నం. బృందావన న్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దిన తీరులోనే కురుక్షేత్రను కూడా తయారు చేయాలన్నదనే హరియాణా ప్రయత్నం. కృష్ణ భగవానుడి జీవితంతో ముడిపడి ఉన్న బృందావన్ కు పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు. కురుక్షేత్రను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మలచాలన్నదే తమ ధ్యేయమని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఉత్తర ప్రాంత విభాగం సంచాలకులు ఆర్కి సుమన్ చెప్పారు. కురుక్షేత్రతో పాటు దేశ వ్యాప్తంగా అటు రామాయణం, ఇటు భారత గాథలతో సంబంధం ఉన్నట్టు చెప్పే అన్ని ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న యోజన ఉన్నది. ఇందుకు రూ. 200 కోట్లు ఖర్చు చేయాలని కూడా ప్రతిపాదించారు. మహాభారత రెండో సర్కిట్ పేరుతో సాగిన కర్నాల్ నదన్సుకు 130 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మూడు రోజులు ఈ కార్యక్రమం జరిగింది.

బ్రహ్మదేవుని గాథలతో బంధం ఉన్న బ్రహ్మ సరోవర్, శ్రీకృష్ణా మ్యూజియం, భీష్ముడు అంపశయ్య ఎక్కాడని చెప్పుకునే భీష్మకుంద్, గీతోపదేశం జరిగిన ప్రదేశంగా చెప్పే జ్యోతిసార్ ప్రదేశాలను మహాభారత సర్కిట్ ప్రణాళిక పేరుతో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. షేక్ చిహ్లి గుమ్మటం, నవి పథషాహి గురుద్వారా, స్థానేశ్వర్ మహదేవ్ ఆలయం, భద్రకాళి ఆలయం వంటివాటిని దర్శనీయ చారిత్రక ప్రదేశాలుగా మలచాలన్న ఆలోచన ఉంది. మహాభారత సర్కిట్ ప్రణాళికలో గుర్తించిన ప్రదేశాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ల లోను విస్తరించి ఉన్నాయి. హస్తినాపురం, మధుర, బద్రీనాథ్ అలాంటివే. హరియాణా పర్యాటక శాఖ చెబుతున్న వివరాలను బట్టి ఒక్క కురుక్షేత్ర పరిధే 147 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలోనే అనేక దేవాలయాలు, పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి.