సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు, అతడే అందర్నీ పాలిస్తున్నాడు అన్న మౌలిక సందేశాన్ని సమాజానికి అందించిన మహాత్ముడు.
నారాయణ గురు క్రీ.శ. 1854 ఆగస్టు 20న కేరళలోని ‘ చంపాజండి’ గ్రామంలో ‘ఈళవ’ కులంలో మదన్ ఆశాన్, కుట్టి అమ్మ దంపతులకు జన్మించాడు. అందరూ ఆయనను ‘ నానూ’ అని పిలిచేవారు. చట్టాంబీ స్వామి అనబడే కుంజన్ పిళ్ళై వద్ద సంస్కృతాన్ని అధ్యయనం చేశాడు. తిక్కాడ్ అయ్యబూ వద్ద యోగశాస్త్రాన్ని అభ్యసించాడు. నారాయణ గురు అరవీపురం అడవుల్లో ధ్యానంలో ఉండి చాలాకాలం తపస్సు చేశాడు. ఇతరులకు మేలు చేయడంలోనే నిజమైన ఆనందం ఉందనే జీవన రహస్యాన్ని తెలుసుకున్నాడు. అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోగులకు సేవ చేస్తూ పేదలైన గిరిజనులకు, హరిజనులకు సేవా సహాయ కార్యక్రమాలు ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు ప్రాంతాలలో పర్యటించినప్పుడు క్రైస్తవ ఫాదరీలు హిందూ ధర్మం మీద, సమాజం మీద చేస్తున్న దాడులను చూచి దానిని ప్రతిఘటించాలని నిశ్చయించుకున్నాడు. కేరళ ప్రాంతంలో ఆనాడు కులతత్వం, అంటరానితనం అనే భూతాలు విలయ తాండవం చేస్తున్నాయి. అందుకే వివేకానందుడు కేరళను పిచ్చాసుపత్రిగా వర్ణించాడు. ఈ భూతాన్ని అంతం చేయాలని నడుం కట్టాడు నారాయణ గురు. తన ఆశ్రమంలో శివాలయాన్ని కట్టించాడు. “ దేవుడి ముందు అందరూ సమానులే. ఉచ్చ నీచ భావాలకు ఆయన అతీతుడు” అని నారాయణగురు ప్రజలకు సందేశాన్నిచ్చాడు. నారాయణ గురు అనేకచోట్ల గుడులు కట్టించి అక్కడ హరిజనులకు ప్రవేశాన్ని కల్పించాడు. ఆ దేవాలయాలు హిందూ సంఘటనకు కేంద్రాలయినాయి. ఈ విధంగా సమాజానికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపించాడు. ప్రజలలోని మూఢనమ్మకాలను తొలగించడానికి ఉద్యమించాడు. ఆయన పశు హింసను సహించలేకపోయాడు. జంతుబలిని ఆపించడంలో ఆయన విజయం సాధించాడు. ప్రజలకు పారిశుద్ధ్య ప్రాముఖ్యతను, నిరాడంబర జీవన మహిమను తెలియజేశాడు. హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవులలో చేరిన వారిని తిరిగి స్వధర్మం వైపు మళ్ళించాడు.
1913లో శ్రీ నారాయణ గురు ఆలువాయిలో అద్వైతాశ్రమాన్ని స్థాపించారు. “ఓం సహోదర్యం సర్వం” అనే సందేశంతో మానవులంతా సమానమే అనే లక్ష్యంతో కార్యక్రమాలు జరుగుతుండేవి. మంగుళూరు నుండి సింహళం వరకు తీర ప్రాంతాలలో “ సర్వత్ర బంధుత్వ” సమ్మేళనాలు జరిగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీజీలు కూడా శ్రీ నారాయణ గురును సందర్శించుకున్నారు. నారాయణ గురు ‘జాతి మీమాంస’ అనే గ్రంథాన్ని వ్రాశారు. “దేశంలోని ప్రతి వ్యక్తి ఉద్యమిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది” అనే సందేశమిచ్చిన నారాయణ గురు 1928 సెప్టెంబర్ 20న పరమపదించారు.