News

శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ఎప్పటినుంచంటే..

251views

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం దేవీనవరాత్రులు అంగరంగవైభవంగా ముగిశాయి. ఇప్పుడు కార్తిక మాసోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తిక మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు.కార్తికమాసమంతా శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశామని వెల్లడించారు.

శని, ఆది, సోమవారం కార్తిక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసి.. అమ్మవారి ఆశీర్వచన మండపంలో కొనసాగింపు ఉంటుందన్నారు. కార్తిక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. నవంబర్ 15న కార్తిక పౌర్ణమి కావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం కార్యక్రమం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.