
(విజయదశమి ప్రత్యేకం )
యుగయుగాలుగా వెంటాడుతూ తరతరాల శిష్ట జనాలను బాధిస్తున్న అసుర మూకను సంహరించింది జగదంబిక. సృష్టిలో స్త్రీశక్తి ధైర్య స్థైర్యాలను చాటింది. అసురుల మీద వరుసగా ఒంటి చేత్తో ఎనిమిది రోజుల పాటు ఏకబిగిన యుద్ధం చేసిన ఆ అమ్మ నవమినాడు లోకకంటకుడైన మహిషాసురుణ్ణి మట్టుపెట్టింది. దశమినాడు దేవతలను అనుగ్రహిస్తూ రాజ రాజేశ్వరీదేవిగా అవతరించింది.
భక్తుల పాలిట కరుణార్ద్రహృదయ అయిన రాజరాజేశ్వరీదేవి దశమినాటి జాబిలిలా ప్రకాశిస్తూ శ్రీమాతగా, శ్రీమహా రాజ్ఞిగా స్తుతులు అందుకుంటోంది. శ్రీమత్ సింహాసనేశ్వరిగా దర్శనమిచ్చి విశ్వశాంతిని వికసింపజేస్తోంది, విజయాలు చేకూరుస్తోంది. అందుకే దేవీనవరాత్రుల్లో మహానవమి, విజయ దశమి తిథులకు అంత ప్రాముఖ్యత వచ్చింది. ఆచార సంప్రదాయాలను అనుసరించి నవమి నాడు నవదుర్గలలోని సిద్ధిదాత్రిని, దశమినాడు రాజరాజేశ్వరీ మాతను అర్చిస్తుంటారు అమ్మవారి భక్తులు.
ముగురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ
నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మహా నవమి మహోత్సవం. దుర్గాదేవి రూపమైన సిద్ధిధాత్రిని ఈ రోజున ఆరాధిస్తారు. దుర్గామాత ఈ అవతారంలోనే మహిషాసురుణ్ణి మట్టి కరిపించి లోకానికి కల్యాణం చేకూర్చింది. భక్తుల కోర్కెలను సిద్ధింపచేస్తుంది. అందుకే ఆ చల్లని తల్లిని.. ‘అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ’ అంటూ స్తుతిస్తాం. ఆ ముగ్గురమ్మలే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా పూజలు అందుకునే తల్లులు. ‘చాల పెద్దమ్మ’ అంటే మహాశక్తి స్వరూపిణి అని అర్థం. అండపిండ బ్రహ్మాండాలంతటా నిండిపోయిన శక్తిస్వరూపమే ఆమె. ఈ శక్తి స్వరూపిణి సమస్త జీవరాశుల్లోనూ ఇమిడి ఉంటుంది.
సృష్టి ప్రారంభంలో అవతరించిన దివ్యశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృజించింది. లక్ష్మి, సరస్వతులను సృష్టించి విష్ణువు, బ్రహ్మలకు ఇచ్చింది. ఈ జగన్మాతను ఆరాధించే శివయ్య సకల సిద్ధులనూ పొందాడు. తనలో సగం చేసుకుని శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. శివుని శరీరంలో ఎడమ వైపున ఉండే తల్లే సిద్ధిదాత్రీ దేవి అన్నది సాధకుల విశ్వాసం. ఆ శక్తిస్వరూపిణి అతీంద్రియ శక్తులను సైతం సిద్ధింపచేస్తుంది.
సిద్ధిధాత్రి రూప విలాసం
మహానవమి నాడు పూజలందుకునే దుర్గమ్మ సిద్ధిధాత్రి రూపంలో నాలుగు చేతులతో పద్మం మీద కూర్చుని ఉంటుంది. కమలం, గద, శంఖ, చక్రాలను ధరించి ఉంటుంది. ఈ రూపంలో దుర్గ అజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మాన్ని గ్రహించేందుకుగానూ జ్ఞానాన్ని అందిస్తుంది. చుట్టూ ఉన్న సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దేవతలు, రాక్షసులు అమ్మను పూజిస్తుంటారు. అణిమ (దేవునికి సమానమైన కీర్తిని గడించటం), మహిమ (ఘనత వహించే శక్తి), గరిమ (బరువును పెంచుకోగల శక్తి), లఘిమ (బరువును తక్కువచేసి చూపగల శక్తి), ప్రాప్తి (అదృష్టం), ప్రాకామ్యం (దూర దర్శనం, దూర శ్రవణం, ఆకాశ గమనం తదితర శక్తులు), ఈశాత్వం (దిక్పాలకులను నియంత్రించే శక్తి), వశిత్వం (సకల జీవరాశులనూ అదుపుచేయగల శక్తి) అనే ఎనిమిది అతీంద్రియ శక్తులు ఈ తల్లి వశంలోనే ఉంటాయి. ఈ కారణం వల్లే శక్తి స్వరూపాలైన ఆయుధాలకు నవమినాడు భక్తిగా ఆయుధ పూజల చేస్తుంటారు.
చల్లని తల్లి దుర్గమ్మ
మహిషమర్దనం తరువాత విశ్వశాంతి కోసం తన రౌద్ర రూపాన్ని విడిచి చల్లని తల్లిగా దుర్గమ్మ అవతరించి భక్తులను కరుణిస్తోంది. అప్పటి ఆ అమ్మ రూపమే రాజరాజేశ్వరి. పరమేశ్వరుని అంకాన్ని ఆసనంగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుదరహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించాలి. అనంతశక్తి స్వరూపిణి అయిన ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసినీ పూజలు చేస్తుంటారు.
అవి కూడా విజయోత్సవాలే!
అమ్మవారు మహిషాసురుణ్ణి వధించిన రోజు విజయదశమి అన్నది ప్రశస్తం. కానీ ఆయా పురాణాలను అనుసరించి ఇతర సందర్భాలూ ఉన్నాయి. పాల సముద్రం నుంచి అమృతభాండం ఆవిర్భవించిన రోజే విజయదశమి అన్నారు. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించిన రోజును విజయ దశమిగా చెప్పారు. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను శమీవృక్షం తొర్రలో ఉంచారు. తిరిగి వచ్చిన అనంతరం ఆ చెట్టుకు పూజచేసి, ఆయుధాలను తీసుకున్నారు. యుద్ధంలో కౌరవులపై విజయం పొందిన రోజే విజయదశమి అని కూడా చెబుతారు.
రాజరాజేశ్వరీదేవి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. అనంతశక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత. రాజరాజేశ్వరీ అష్టకంలో ఆదిశంకరాచార్యులు అమ్మ రూప గుణ లావణ్యాలను వివరించారు.
విజయదశమి సందర్భంగా అమ్మవారికి కలశం పెట్టి, శ్రీరాజరాజేశ్వరీ అష్టోత్తరం పఠిస్తూ పూజలు చేసి, ఆ తల్లికి ఇష్టమైన లడ్డూతో పాటు షడ్రసోపేతమైన భోజన పదార్థాలతో మహానివేదన చేస్తారు. విజయదశమిరోజు అమ్మవారికి సామూహికంగా అర్చనలు చేసి, ఉద్వాసన పలికి, నిమజ్జనం చేసే సంప్రదాయం కూడా ఉంది.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంగా అలంకరించడం తెలిసిందే. చివరి అలంకారంగా శీ రాజరాజేశ్వరీదేవిని దర్శింపచేస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపురసుందరిగా, అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజిస్తారు. రాజరాజేశ్వరీ అమ్మవారిని పూజించే వారికి విజయాలు కలుగుతాయని దేవీపురాణం తెలియచేస్తోంది. ఈ పర్వదినాల్లోనే కాదు.. నిత్యం అమ్మను స్మరించి, సుఖసంతోషాలతో వర్థిల్లుదాం.





