
అన్నమయ్య జిల్లా కేవీపల్లె ఆవుల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్‌ఐ లక్ష్మీదేవి తెలిపారు. కేవీపల్లె మండలంలోని లక్ష్మీరెడ్డిగారిపల్లెకు చెందిన షేక్ ఖాజా కేవీపల్లె, గర్నిమిట్ట ప్రాంతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఖాజా చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. తన సమీప బంధువు అయిన పీలేరుకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడు. ఇద్దరూ కలసి ఇటీవల లక్ష్మీరెడ్డిగారిపల్లె, కుమ్మరపల్లె ప్రాంతంలో మూడు ఆవులను చోరీ చేసి, మాయమాటలు చెప్పి అమాయకులకు విక్రయించారు. ఆ డబ్బులను విలాసాలకు ఖర్చు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 1.70 లక్షలు విలువ చేసే మూడు ఆవులతోపాటు రూ. 2 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది కోదండరామయ్య, ఆదినారాయణ, అల్తాఫ్ పాల్గొన్నారు.




