బంగ్లాదేశ్‌లోని మైనారిటీ ప్రజలపై అత్యాచారాలు, పీడనలకు కనుచూపుమేరలో అంతమనేదే కనిపించడం లేదు. దుర్గాపూజ వేడుకలు జరుపుకోడానికి జిజియా పన్ను కట్టాలంటూ హిందువులను బెదిరించిన తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశీ ముస్లిములు బౌద్ధ సన్యాసుల మీద పడ్డారు. చిట్టగాంగ్ పర్వతప్రాంతాల్లోని బౌద్ధులు ఈ యేడాది ‘కథిన్ చిబార్ దాన్’ పండుగ జరుపుకోబోమని ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని బౌద్ధులకు అది పెద్ద పండుగ. భద్రతా కారణాల రీత్యా ఈ యేడాది అంత ప్రధానమైన పండుగ చేసుకోబోమని వాళ్ళే నిర్ణయించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రంగమతి ప్రాంతంలోని మైత్రీ బౌద్ధ విహారంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో పర్బత్య భిక్షు సంఘ అధ్యక్షుడు శ్రద్ధాలంకార్ మహతెరో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితి, అభద్రత కారణంగా చిట్టగాంగ్ పర్వత ప్రాంతంలోని ఏ బౌద్ధమందిరంలోనూ ఈ యేడాది పండుగ జరగబోదని స్పష్టం చేసారు. నిజానికి ఆ పండుగ నవంబర్ మొదటివారంలో జరగాల్సి ఉంది.
దేశంలో మైనారిటీలపై హింసాకాండ నానాటికీ పెరుగుతూనే ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బౌద్ధసాధువులు వివరించారు. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ (సిహెచ్‌టి)లో హింసాకాండకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారణం పోలీసు విభాగం శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమవడమేనని ఆరోపించారు. మతపరమైన దాడుల విషయంలో పేరుకు దర్యాప్తు కమిటీలను ఏర్పాటు చేసినా, ఆ కమిటీలను దర్యాప్తు చేయనీయడం లేదని వారు వివరించారు.
సెప్టెంబర్ 18, 20, అక్టోబర్ 1 తేదీల్లో ఖాగ్రాచారీ, రంగమతి పర్వత ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల గురించి శ్రద్ధాలంకార్ మహతెరో వివరించారు. ఆ మూడు రోజుల్లో ముస్లిం సెటిలర్లు స్థానిక ఆదివాసీ గిరిజన ప్రజల ఇళ్ళు లూటీ చేసి ధ్వంసం చేసారు, వందలాది దుకాణాలను తగులబెట్టేసారు. ఆ దాడుల్లో నలుగురు ఆదివాసీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక విద్యార్ధి కూడా ఉన్నారు. బౌద్ధ దేవాలయాల్లో హుండీలను దొంగతనం చేసారు, బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసారు.
బౌద్ధమతాన్ని పాటించేవారు బౌద్ధసాధువులకు ‘చిబార్’ అని పిలిచే ప్రత్యేక దుస్తులను ప్రతీయేటా ఒకసారి దానం చేస్తారు. అదే ‘కతిన్ చిబార్ దాన్’ పండుగ. ఆ దుస్తులను భక్తులు ఒక్కరాత్రిలో చేతితో నేస్తారు. ఈ వేడుక 2500 సంవత్సరాల క్రితం విశాఖుడు అనే గౌతమబుద్ధుడి సేవకుడు ప్రారంభించాడు.