
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతం… వేకువజామున స్వామిని యోగనిద్ర నుంచి మేల్కొలపడానికి, శుభోదయం తెలుపుతూ సుప్రభాత స్తోత్రం జపిస్తారు. శ్రీవారి సుప్రభాతం ‘కౌసల్యా సుప్రజా రామా’ వినడం భక్తులకు గొప్ప అనుభవం. కోట్లాది భక్తులు నిత్యం వింటుండే సుప్రభాతాన్ని క్రీ.శ.1,400 సమయంలో మలయాళీ మహాముని ప్రతివాది భయంకర అణ్ణన్ ఆచార్యులు సంస్కృతంలో రచించారు. దాదాపు 600 ఏళ్ల తర్వాత 1983లో తెనాలికి చెందిన ప్రముఖ కవి దుర్గానంద్ తెలుగులోకి అనువదించారు. మళ్లీ ఇప్పుడు విశాఖపట్నానికి చెందిన రచయిత్రి, అనువాదకురాలు డాక్టర్ చిట్టిళ్ల నిర్మలాదేవి హిందీలోకి అనువాదం చేయడం విశేషం.
డాక్టర్ చిట్టిళ్ల నిర్మలాదేవి సంస్కృత సుప్రభాతానికి ఏమాత్రం తీసిపోనట్టుగా హిందీ సుప్రభాతాన్ని ఆడియో రికార్డు చేయించారు. ఇటీవల తెనాలి వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి వినిపించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీకి సమర్పిస్తున్నట్టు తెలిపారు.
అలా వచ్చిందీ ఆలోచన..
ఏటా తిరుమలవాసుని సేవలో ఉంటున్న నాకు, వేకువజామునే శ్రీవారికి మేలుకొలుపు పాడే శ్రీవేంకటేశ్వరస్వామి సుప్రభాతం దేశంలో అత్యధిక జనాభా మాట్లాడే హిందీలో ఎందుకు ఉండకూడదన్న ప్రశ్న తలెత్తింది. ఆలోచన వచ్చిందే తడవుగా నేనే పూనుకున్నా. సుప్రభాతాన్ని హిందీలోకి అనువదించా. మూల సంస్కృతంలోని కొన్ని పదాలను తీసుకుని సరళమైన హిందీలో రాశాను. హిందీ తెలిసిన సన్నిహితులు/ స్నేహితులకు పంపాను. అందరూ ప్రోత్సహించటంతో ప్రపత్తి, స్త్రోత్రం, మంగళాశాసనం… మొత్తాన్ని అనువదించాను. ‘అదివో అల్లదిగో’లో రన్నర్‌గా నిలిచిన తిరుపతికి చెందిన బీటెక్ విద్యార్థిని అక్కినపల్లి లక్ష్మీశైలజతో పాడించి, రికార్డు చేయించాను. చాలా అభినందనలు వచ్చాయి.
అప్పుడే సార్థకత
తెనాలిలోని హిందీ ప్రేమీమండలిలో గాంధీజయంతి రోజున బోయపాటి నాగేశ్వరరావు–సుభద్రాదేవి 22వ వార్షిక గురుపీఠ పురస్కారాల్లో సత్కారం అందుకున్నాను. అదేరోజు ఇక్కడ చిన్నతిరుపతిగా పిలుచుకునే వైకుంఠపురం దేవస్థానాన్ని దర్శించుకున్నా. స్వామి వారికి నా హిందీ సుప్రభాతం వినిపించాను. తిరుమలలో జరిగే శ్రీవేంకటేవ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లినపుడు, టీటీడీ అధికారులకు నేను అనువదించిన హిందీ సుప్రభాతాన్ని అందిస్తాను. స్వామి కరుణ లభించి, శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్‌లో ప్రసారమైతే నా కృషికి సార్థకత లభిస్తుందని భావిస్తున్నా.
మరికొన్ని రచనలు కూడా..
అంతేకాకుండా ఏడు శ్లోకాలు గల శ్రీవేంకటేశ్వరస్వామి వజ్ర కలశ స్త్రోత్రాన్నీ హిందీలోకి తీసుకొచ్చాను. హనుమాన్ చాలీసాలా ‘శ్రీశ్రీనివాస చాలీసా’ను 20 శ్లోకాలతో రాశారు. అందులో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, స్వామి భూమిపై అవతరించటం, శిలగా మారటం… వంటి ఇతివృత్తంతో రాశాను. అమ్మవారిపై హిందీలోనే ‘పద్మావతి అమ్మవారి పదశోభ’ను మరో 32 శ్లోకాల్లో రాశాను.





