
విజయనగరం జిల్లా ప్రజల ఇలవేల్పు..ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి చరితం అమోఘం. ఎన్ని సార్లు విన్నా..వినాలనిపించే ఆ తల్లి చరిత్ర వింటే పుణ్యఫలం. ఆ తల్లిని మనసులో స్మరిస్తూ కోర్కెలు కోరితే..కొద్ది రోజుల్లోనే ఈడేరిన వెంటనే ప్రపంచంలో ఎక్కడున్నా ఆ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు తరలిస్తారు. అక్కడితో ఆగకుండా ఏటా అమ్మను దర్శించుకోవడానికి తొలేళ్ల నుంచి సిరిమానోత్సవం వరకూ ఉండి పసుపు, కుంకుమలతో పాటు మొక్కుబడులు చెల్లిస్తారు. చల్లంగా చూడుతల్లీ..మళ్లీ వస్తామంటూ ఆ ప్రకృతి స్వరూపిణి పైడితల్లిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. అంతటి మహిమాన్వితమైన ఆ పైడితల్లమ్మ వెలిసింది విజయనగరం లోని రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలోనే. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడికి వెళ్లడం ఆనవాయితీ. సిరిమానోత్సవం కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కోటశక్తికి విశేష పూజలు నిర్వహిస్తారు. అయినప్పటికీ అమ్మవెలిసింది వనంలోనే. అప్పట్లో స్థానిక రైల్వేస్టేషన్ ప్రదేశం పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉండేది. ఇదివరలో రైల్వేస్టేషన్ ప్రాంతాన్ని అన్యాయపురంగా పిలిచేవారు. ఎందుకంటే అదంతా దారిదోపిడీలకు నిలయంగా ఉండేదని నానుడి. వనంలోనే వెలిసిన ఆపైడితల్లి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.
అన్నను వారించినా..
బొబ్బిలి యుద్ధం సమయంలో రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి తన అన్న విజయరామరాజును పైడితల్లమ్మ ముందే హెచ్చరించింది. యుద్ధం వద్దని వారించినా ఆమె మాటను అన్న పెడచెవిన పెట్టాడు. యుద్ధంలో విజయరామరాజును తాండ్రపాపారాయుడు హతమారుస్తాడు. పెద్దవిజయరామరాజును రక్షించుకోవాలని చిన్నారి పైడితల్లి..పతివాడ అప్పలనాయుడు సహాయంతో యుద్ధం జరిగే స్థలానికి బయలుదేరింది. వారిద్దరూ కోట దగ్గర నుంచి బయలుదేరి పెద్దచెరువు వద్దకు వచ్చేసరికి అన్న మరణవార్త ఆమె చెవిన పడుతుంది. అన్నంటే ఎంతో అభిమానం. వాత్సల్యం ఉన్న ఆమె ఆ వార్త విని తట్టుకోలేక తాను నిత్యం పూజించే మహాశక్తిని ప్రార్థిస్తూ పెద్దచెరువులో లీనమైపోయింది.
పెద్దచెరువులో ప్రతిరూపాలు
అదేరోజు రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలో పైడితల్లి కనిపించి..తన ప్రతిరూపాలు పెద్దచెరువులో లభ్యమవుతాయని, వాటిని తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని కోరింది. ఆ ప్రకారంగానే రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న పెద్దచెరువులో బెస్తవారి సహాయంతో వెతగ్గా ఆ నీటిలో అమ్మ ఓ మెరుపులా సాక్షాత్కరించి తానిక్కడ ఉన్నాననే సంకేతాన్నిచ్చింది. వెంటనే వారు ఆ ప్రదేశంలో వెతగ్గా అమ్మ విగ్రహాలు లభ్యమయ్యాయి. అమ్మవారిని ప్రతిష్టించి గుడి నిర్మించారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం కావడంతో వనంగుడి అని పేరువచ్చింది. సిరిమానోత్సవాన్ని కూడా చదురు కట్టి నిర్వహించడం కోటశక్తికి పూజలు చేయడం మూలంగా చదురుగుడి వద్ద సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
వనంగుడిలో దుర్గమ్మ, ముత్యాలమ్మ
వనంగుడిలో అమ్మవారికి ఇష్టమైన దుర్గాదేవి, ముత్యాలమ్మ అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి నెలా మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు, అమ్మవారికి చండీహోమం శరన్నవరాత్రుల రోజుల్లో దుర్గాదేవికి అలంకరణలు, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. అమ్మవారి పాత విగ్రహానికి ఆలయం వెనుక ప్రత్యేక గది కట్టి నిత్యపూజలందిస్తున్నారు. చండీహోమాన్ని అమ్మవారి విగ్రహానికి ఎదురుగా నిర్వహిస్తున్నారు. సహస్ర దీపాలంకరణ అమ్మవారికి జరుగుతుంది. రైల్వేస్టేషన్ ప్రాంతం కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తారు.





