
అయోధ్య రామమందిర పూజారుల వస్త్రధారణలో మార్పులు చేశారు. ఇకపై రామమందిర గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో పూజారులు రామానందాచార్య సంప్రదాయం ప్రకారం కుట్టని పసుపు రంగు వస్త్రాలను ధరించనున్నారు. ముఖ్యంగా సిల్క్‌తో తయారైన కుట్టని ఉత్తరీయాన్ని ధరించాలని నిర్ణయించారు. చలికాలంలో కూడా ఇదే తరహా కుట్టని ఉన్ని వస్త్రాలను ఉపయోగించనున్నారు. రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ అనంతరం పూజారులు చౌబందీ (కుర్తా) ధరించే విధానం అమల్లో ఉంది. తాజాగా పూజా వ్యవస్థను రామానందాచార్య సంప్రదాయం, ప్రాచీన వైష్ణవ ఆచారాలకు అనుగుణంగా రూపొందించేందుకు నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. ఆలయంలో పూజా కార్యక్రమాలకు శాశ్వతమైన, క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఆ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పూజారులకు ప్రత్యేక నియమావళి
సోమవారం జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మతపరమైన కమిటీ సమావేశంలో పూజారులకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. పూజారుల నియామకం, వారి ఆచరణ, రోజువారీ విధులు, పూజా విధానం, భగవంతుడి అలంకరణ, నైవేద్యం, హారతి, ఇతర ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక నియమావళిని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానాలను సమీక్షించి ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వాటిని మరింత స్పష్టంగా రూపొందించనున్నారు.
ఇందుకోసం నియమావళి ముసాయిదాపై కమిటీ సభ్యులు చర్చించారు. త్వరలోనే ఆ నిబంధనలను ఖరారు చేసి రామమందిరంలోని నిత్యపూజా కార్యక్రమాల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పూజారుల వస్త్రధారణపై కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ దాస్ కీలక వివరాలు వెల్లడించారు. పూజారులంతా సిల్క్‌తో తయారైన కుట్టని ఉత్తరీయాన్ని ధరించనున్నట్లు తెలిపారు. శీతాకాలంలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ కుట్టని ఉన్ని వస్త్రాలను ధరిస్తారని చెప్పారు.
ఆలయ నిర్వహణపై చర్చ
అదే సమయంలో రామమందిర నిర్వహణకు సంబంధించి కూడా మతపరమైన కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించాల్సిన అవసరం లేదని మతపరమైన కమిటీ సభ్యుడు మహంత్ మిథిలేశ్ నందినీ శరణ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం లేదా ట్రస్ట్ అటువంటి నియామకం చేస్తే తాను వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. ఆలయాల నిర్వహణలో ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉండాలని ఆయన అన్నారు.
ఆలయాలు, మఠాలు, ఆశ్రమాల సంప్రదాయాలతో అనుబంధం ఉన్నవారికి నిర్వహణలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరిపాలనా సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆలయాన్ని నిర్వహించగలిగినా ఆయన దృష్టి పూర్తిగా పరిపాలనా వ్యవస్థపైనే ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని పలు ప్రముఖ ఆలయాల నిర్వహణ సీఈవోల ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే రామమందిరం వంటి పవిత్ర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక సంప్రదాయాలు, పూజా విధానాలకు తగిన ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేశారు.
ఆగస్టు 15 నుంచి ఝూలనోత్సవం
ఇక అయోధ్య రామమందిరంలో ఆగస్టు 15 నుంచి 12 రోజుల పాటు ఝూలనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నూతనంగా ఏర్పాటు చేసిన మతపరమైన కమిటీ సభ్యులు ఇప్పటికే తొలి సమావేశంలో చర్చించారు. ఉత్సవం తొలి రోజు ఉత్తర ద్వారం నుంచి రామ్‌లల్లా ఉత్సవ విగ్రహంతో పల్లకి యాత్ర నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన ద్వారం ముందు నుంచి ఆ యాత్ర కొనసాగి ప్రాకార ప్రాంతం, ఆలయ పరిసరాల మీదుగా కుబేర్ టీలా వరకు చేరుకోనుంది. అక్కడ సుమారు రెండు గంటల పాటు ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని తిరిగి గర్భగుడికి తీసుకురానున్నారు. అనంతరం రామ్‌లల్లాను బంగారు అలంకరణతో కూడిన వెండి ఉయ్యాలలో ఆశీనులను చేయనున్నారు.
కుబేర్ టీలా వద్ద ప్రత్యేక దర్శనం
ఝూలనోత్సవం తొలి రోజు రామ్‌లల్లా ప్రాచీన కుబేర్ టీలా వద్ద ఝూలాలో ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం శృంగార హారతి అనంతరం స్వామివారిని ఝూలాలో ఉంచనున్నారు. మధ్యాహ్నం భోగ సమర్పణ సమయంలో కొద్దిసేపు తెరను మూసివేస్తారు. అనంతరం భక్తులకు మళ్లీ ఝూలాలో స్వామి వారి దర్శ కల్పించనున్నారు. మల్పువా, పూరీ, ఖీర్ వంటి సంప్రదాయ వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం నుంచే వీలైనంత ఎక్కువ సమయం రామ్‌లల్లా ఝూలా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం కొద్దిసేపు మాత్రమే దర్శనం నిలిపివేసి అనంతరం తిరిగి కొనసాగించనున్నారు.
సాయంత్రం శయనకాలంలోనూ ఝూలాలో ఆశీనులైన రామ్‌లల్లాను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. అయోధ్యలోని సాధువులు, సంతులను ఉత్సవంలో పాల్గొనేందుకు ముందుగానే ఆహ్వానించనున్నారు. ఝూలనోత్సవ ఏర్పాట్లను రామమందిర ట్రస్ట్, మతపరమైన కమిటీ సభ్యులు పరిశీలించారు. ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్, మహంత్ దినేంద్ర దాస్, మహంత్ మిథిలేశ్ నందినీ శరణ్, రాజ్‌కుమార్ దాస్, మహంత్ రామానంద దాస్, మహంత్ కమల్ నయన్ దాస్, వేదాచార్య ఇంద్రదేవ్ మిశ్రా తదితరులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. భక్తుల దర్శన ఏర్పాట్లు, పూజారులకు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా పరిశీలించారు. పల్లకీ యాత్ర, కుబేర్ టీలా వద్ద ఝూలనోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన అలంకరణ, ఇతర ఏర్పాట్లపై చర్చించారు.





